ఎమ్మెల్సీ బృందాన్ని కలిసిన వైఎస్సార్‌ టీఏ నాయకులు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ బృందాన్ని కలిసిన వైఎస్సార్‌ టీఏ నాయకులు

Aug 12 2026 3:16 AM | Updated on Aug 12 2026 3:16 AM

పుట్టపర్తి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో పలు సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ బృందాన్ని వైఎస్సార్‌టీఏ నాయకులు మంగళవారం తిరుపతిలో కలిశారు. ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డికి ఉపాధ్యాయ సమస్యలను విన్నవించారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, టెట్‌ మినహాయింపు తదితర అంశాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల అధ్యక్షులు పీవీ రమణారెడ్డి, నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణ పాల్గొన్నారు.

ఆలువ వేటగాళ్ల అరెస్ట్‌

కదిరి టౌన్‌: ఆలువ వేటగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దొరిగల్లు ఈస్ట్‌ బీట్‌, దొరిగల్లు రిజర్వు ఫారెస్ట్‌లోని వనం బావి ప్రాంతంలో సోమవారం వేటగాళ్లు ఆలువను వేటాడుతున్నట్లు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది వెంటనే దాడి చేశారు. నార్పల మండలం రంగాపురానికి చెందిన రామాంజనేయులు, రాజేంద్రబాబు, కుళ్లాయప్ప, ఉమామహేశ్‌, గంగన్న యాదవ్‌, బత్తలపల్లికి చెందిన ముత్యాలయ్య, ఆంజినేయులును అరెస్టు చేశారు. వేటగాళ్ల నుంచి ఒక ఆలువ, స్కూటర్‌, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కదిరి కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపారు.

ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు

కదిరి టౌన్‌: పట్టణ పోలీసులు ఇద్దరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ బి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. కదిరిలోని నారాయణమ్మ కాలనీకి చెందిన అంజినమ్మ, అల్తాఫ్‌ పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన ఓ ప్రేమ జంట ఇటీవల పారిపోయి వచ్చి అల్తాఫ్‌ ఇంట్లో తలదాచుకుంది. ఈ విషయంపై పోలీసులకు అంజినమ్మ సమాచారం ఇచ్చిందని అనుమానించిన అల్తాఫ్‌ మంగళవారం ఆమైపె దాడికి పాల్పడ్డాడు. కులం పేరుతో దూషించాడు. స్థానికురాలు ప్రమీలతో కలిసి ఇటుకతో చాతీపై కొట్టి గాయపరిచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అల్తాఫ్‌, ప్రమీలపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement