అమరాపురం: కలుపు మొక్కకు మందును పిచికారీ చేస్తే తోటలోని 300 కాకడ పూల చెట్లు ఎండిపోయాయని ఓ రైతు వాపోయాడు. వివరాలు.. మండల పరిధిలోని తమ్మడేపల్లికి చెందిన రైతు మధుసూదన్ తన పొలంలో 300 కాకడ మొక్కలు సాగు చేశాడు. శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో పూల దిగుబడి పెరగాలని, చెట్లలో ఉన్న పురుగులు చావాలనే ఉద్దేశంతో మందు తెచ్చి పిచికారీ చేశాడు. పురుగు మందుకు బదులు కలుపు మందును ప్రతి చెట్టుకు పిచికారీ చేశాడు. సాయంత్రానికి కాకడ చెట్ల ఆకులు, పూలు, మొగ్గ ఎండిపోయాయి. దీంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రావణ మాసంలో మంచి లాభాలు గడించవచ్చని అనుకున్న తరుణంలో ఇలా జరిగిందంటూ వాపోయాడు. సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని ఆయన కోరాడు.


