కనగానపల్లి: మండలంలోని వేపకుంట గ్రామంలో మంగళవారం పోతలయ్యస్వామికి బోనాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతలయ్యస్వామి ఆలయానికి పచ్చని తోరణాలు కట్టి స్వామి వారిని ఆభరణాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు, యువకులు బోనాల దుత్తలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. గొర్రెలు, మేకలు, పాడి పశువులను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. గ్రామ దేవతలకు పూజలు చేయటం ద్వారా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్మకమని గ్రామ పెద్దలు తెలిపారు.


