పుట్టపర్తి జనసంద్రం | - | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి జనసంద్రం

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

సాక్షి, పుట్టపర్తి

గా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ జిల్లా వ్యాప్తంగా నిరసన, ర్యాలీలతో కదం తొక్కింది. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, యువతతో కలిసి పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, హిందూపురం, మడకశిరలో భారీ ర్యాలీలు నిర్వహించింది. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలనే డిమాండ్‌ హోరెత్తింది. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని యువత, నిరుద్యోగులు, విద్యార్థులు గళమెత్తారు. అక్కడక్కడా వైఎస్సార్‌సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తేల్చిచెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ర్యాలీలతో నియోజకవర్గ కేంద్రాల్లో కిలోమీటర్ల మేర జనాలు పోగయ్యారు. ఎటు చూసినా వైఎస్సార్‌సీపీ జెండాలే దర్శనమిచ్చాయి. డ్రోన్‌కు తప్ప మొబైల్‌ కెమెరాకు చిక్కని విధంగా జనాలు తరలివచ్చారు. కనుచూపుమేర వైఎస్సార్‌సీపీ జెండాలతో అభిమానులు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు దగా డీఎస్సీకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీతో ధర్మవరం పట్టణం దద్దరిల్లింది. ఎస్‌బీఐ కాలనీలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి కాలేజీ సర్కిల్‌ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు వందలాది మంది జనాలతో ర్యాలీ నిర్వహించారు. యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ధర్మవరం నిండిపోయింది. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిందన్నారు. స్పోర్ట్స్‌ అసోసియేషన్లకు టీడీపీ ప్రజాప్రతినిధులను చైర్మన్‌లుగా నియమించి అనర్హులకు క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చి రూ.లక్షలు సొమ్ముచేసుకున్నారన్నారు. 2 శాతం ఉన్న స్పోర్ట్స్‌ కోటాను 3 శాతానికి పెంచడం, డీఎస్సీ నియామకాలు పూర్తిగానే స్పోర్ట్స్‌ కోటా పెంచుతూ ఇచ్చిన జీఓ రద్దు చేయడం అక్రమాలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం సీబీఐ దర్యాప్తు చేయించాలన్నారు. లేని పక్షంలో నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కదిరిలో చేపట్టిన ర్యాలీకి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, యువకులు సైన్యంలా కదిలివచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (యాక్టివిటీ) వజ్రభాస్కర్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ చేశారు.

నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో మడకశిరలో నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి నుంచి నిరుద్యోగులు, యువత, విద్యార్థులు తరలివచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో మడకశిర పట్టణం నిండిపోయింది. అనంతరం ఈరలక్కప్ప మాట్లాడుతూ..డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోతే సీబీఐతో విచారణ జరిపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదన్నారు. సంబంధిత విద్యాశాఖ మంత్రి కనీసం నోరు విప్పడం లేదని, దీన్నిబట్టి చూస్తే అవకతవకలు ఏ మేరకు సాగాయో అర్థమవుతోందన్నారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.

ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీతో పుట్టపర్తి జన సంద్రమైంది. అమడగూరు, ఓడీ చెరువు, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువతతో ర్యాలీ హోరెత్తింది. వందల మంది కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... డీఎస్సీ నియామకాలన్నీ సవ్యంగా సాగి ఉంటే వెంటనే సీబీఐతో విచారణ జరిపించి నిజాయితీని నిరుపించుకోవాలని మంత్రి లోకేష్‌కు సూచించారు. ఇంతజరుగుతున్నా ఆయన మౌనంగా ఉండటం చూస్తే అక్రమాలు నిజమేనని అర్థమవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో పాఠశాలల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు.

హిందూపురంలో సమన్వయకర్త టీఎన్‌ దీపిక ఆధ్వర్యంలో వందల మందితో బైక్‌ ర్యాలీ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి తెలుగు తల్లి సర్కిల్‌ మీదుగా సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ సాగింది. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం రూరల్‌ నుంచి పట్టణానికి భారీగా తరలివచ్చారు. యువత, నిరుద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్‌ సర్కిల్‌లో టీఎన్‌ దీపిక మాట్లాడుతూ...డీఎస్సీ అక్రమాలను వైఎస్సార్‌సీపీ వెలుగులోకి తీసుకురావడంతో సీఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు మింగుడుపడటం లేదన్నారు. అందుకే తమ నిరసనలకు పోలీసులను అడ్డం పెట్టి అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు. అర్హులకు న్యాయం జరిదేదాకా అండగా ఉంటామన్నారు.

హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో మాట్లాడుతున్న పార్టీ సమన్వయకర్త టీఎన్‌ దీపిక

అర్హులకు న్యాయం చేయాలని కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఊరూరా యువకులు, నిరుద్యోగులతో కలిసి ర్యాలీలు

నారా లోకేష్‌ మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు పోరాడతామని వెల్లడి

ఉపాధ్యాయ పోస్టింగుల్లో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌

ర్యాలీలకు తరలి వచ్చిన యువజన, విద్యార్థి విభాగం నాయకులు

మడకశిరలో జనహోరు..

కదిరిలో కదిలిన సైన్యం..

‘పురం’లో జనతరంగం..

దద్దరిల్లిన ధర్మవరం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement