కనగానపల్లి: ఆరుగాలం కుటుంబంతో సహా కష్టపడి పనిచేసే రైతన్నకు అన్ని కష్టాలే. ఒకవైపు వర్షాభావ పరిస్థితుల్లో మెట్ట పంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఆరుతడి పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు టమాట పంట సాగు చేశారు. అందులో ఒక్క కనగానపల్లి మండలంలో సుమారు 5 వేల ఎకరాల్లో టమాట సాగులో ఉంది. యలకుంట్ల, బద్దలాపురం, తరగకుంట, కనగానపల్లి గ్రామాల్లోని రైతులు టమాట ఎక్కువగా సాగు చేశారు. ఈసారి దిగుబడితో పాటు గిట్టుబాటు ధర కూడా తగ్గింది. అనంతపురం టమాట మండీలో మొదటి రకం టమాట కేజీ గరిష్టంగా రూ.10 కూడా ధర పలకటం లేదు. ఇక రెండో రకం, మూడో రకం టమాటను అడిగేవారే లేరు. దీంతో టమాటను మార్కెట్ వరకూ తీసుకువెళ్లినా కోత కూలీలు, రవాణా ఖర్చులు రావన్న ఉద్దేశంతో రైతులు రోడ్లపైనే పడేస్తున్నారు.


