మొక్కితే చాలు కోర్కెలు తీరినట్లే ! | - | Sakshi
Sakshi News home page

మొక్కితే చాలు కోర్కెలు తీరినట్లే !

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

నల్లచెరువు: మేజర్‌ పంచాయితీ పరిధిలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి శనివారం, మంగళవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈనెల 15 నుంచి శ్రావణ మాస ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

పూలు అతికించి కోర్కెలు

చుట్టుపక్కలు దొంగతనాలు వంటివి ఏవైనా జరిగితే స్వామి వారి సన్నిధిలో సత్య ప్రమాణాలు చేయిస్తారు. తప్పు చేసిన వారు అసత్య ప్రణాలు చేస్తే స్వామివారు వెంటనే నిజరూప దర్శనం చూపిస్తాడనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. అలాగే సంతానం లేని వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించాలని స్వామివారికి ముడుపులు కడతారు. వారి సమస్యలు పరిష్కారం అయిన వెంటనే భక్తులు స్వామి వారికి ముడుపులు చెల్లించుకుంటారు. స్వామివారి మూలవిరాట్‌ వద్ద పూలను అతికించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని కోరికలు కోరుకున్న సమయంలో స్వామివారి కుడి చేతి నుంచి పూలు కింద పడితే తమ కోరికలు నెరవేరుతాయని, ఎడమ చేతి నుంచి పూలు పడితే కోరికలు నెరవేరవని భక్తుల నమ్మకం.

శ్రావణమాస ఉత్సవాలు

ప్రతి ఏటా శ్రావణమాసం ప్రారంభం నుంచి స్వామి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది 15న మొదటి శనివారం, 22న రెండో శనివారం, 29న మూడో శనివారం, సెప్టెంబర్‌ 5న నాల్గవ శనివారం స్వామివారి ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఆలయానికి ఇలా వెళ్లాలి ..

పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకోవాలంటే కదిరి – మదనపల్లి జాతీయ రహదారిలో గత పాత రైల్వేస్టేషన్‌ నుంచి పి. కొత్తపల్లి, పోలేవాండ్లపల్లి, బాలేపల్లి తండా రోడ్డు గుండా 3 కిలో మీటర్లు వెళితే స్వామివారి ఆలయానికి వస్తుంది. శ్రావణ మాసం ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ సమయంలో పాత రైల్వేస్టేషన్‌ నుంచి ఆలయానికి ఆటోల సౌకర్యం ఉంటుంది.

భక్తుల కోరికలు తీర్చే దైవంగా

పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి

15 నుంచి శ్రావణ మాస ఉత్సవాలు

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తులు నిర్వాహకులు

పుట్ట నుంచి బయట పడిన విగ్రహం

పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి కొలువైన ఈ ప్రాంతం 14వ దశాబ్దం మధ్య కాలంలో సింహపురి (నేటి నెల్లూరు)ను కాటమరాజు పరిపాలించే వారు. ఆ రోజుల్లో విపరీతమైన కరువు సంభవించింది. రాజు ఆజ్ఞ ప్రకారం పశువుల విడిది కోసం సేనాధిపతి రాజ్యమంతా తిరుగుతూ ఖాద్రీపురం(కదిరి) గ్రామానికి చేరారు. ఖాద్రీశుడిని దర్శించుకొని సేనాధిపతి తమ గుర్రాలను ఒక చోట మేతకు విడిచి గ్రామం అంతా తిరిగారు. గ్రామం మొత్తం మల్లెపూల పరిమళం, ఎటు చూసినా పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండేది. ఈ ప్రాతాన్ని కరువు విడిదిగా ఎంచుకున్న విషయాన్ని రాజుకు తెలిపారు. రాజు ఆజ్ఞ ప్రకారం పశువులను కదిరి పట్టణానికి పది మైళ్ల దూరంలో ఉన్న నల్లచెరువు గ్రామం పరిధిలోని దిన్నె మీద పశువుల కోసం పాక వేశారు. దిన్నె మీద ఉన్న గడ్డి మేయగానే పశువులు కోలుకుని సమృద్ధిగా పాలిచ్చాయి. పశువుల పాక వేసిన స్థలానికి కొద్ది దూరంలో ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట దగ్గరకు ఈనని, కట్టని గోవు వెళ్లి నిలబడగా ఆ గోవు పొదుగు నుంచి పాలు పుట్టలోకి వెళ్తున్న విషయాన్ని సేనాధిపతి గుర్తించాడు. వెంటనే పుట్టకు పూజలు చేసి అపై పుట్టను తవ్వించి చూడగా హనుమంతుడి విగ్రహం బయట పడింది. సేనాధిపతి ద్వారా విషయం తెలుసుకున్న కాటమరాజు స్వామి వారి విగ్రహాన్ని ఆ స్థలంలో ప్రతిష్టించారు. ఒక్క రోజులోనే స్వామి వారి గుడి కట్టారు. సమయం లేక పోవడంతో గుడిపై మూత అలాగే వదిలేశారు. పాలు గారిన చోట ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని చుట్టు పక్కల గ్రామస్తులు స్వామివారికి పూజలు చేశారు. పాలుగారి పారిన దిన్నె పాలపాటిదిన్నెగా ప్రసిద్ధి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement