రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి కోడూరు థామస్‌ మన్రో తోపు సమీపంలోని టెక్స్‌పోర్ట్‌ గార్మెంట్స్‌ వద్ద గుర్తు తెలియని కారు ఢీకొని కోడూరు కు చెందిన గంగమ్మ (65) మృతి చెందింది. ఫ్యాక్టరీ వద్ద వాహనాలను గమనించకుండా రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టినట్లు పోలీసులు చెబతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు.

ఇగ్నో కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జూలై–2026 సెషన్‌కు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాలలోని ఇగ్నో అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్‌ మురళీమోహన్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే పీజీ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు రీ–రిజిస్ట్రేషన్‌ ఫీజును కూడా ఆన్‌లైన్‌ ద్వారా 15 వరకు చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 94404 26895, 98669 24626 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య

పుట్టపర్తి: తీవ్ర అనారోగ్యంతో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణరెడ్డి వివరాల మేరకు .. గ్రామానికి చెందిన బండ్రబోయిన అశోక్‌ (35) గ్రామ సమీపంలోని హైవేపై కిరాణా షాపు ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తరచూ కడుపు నొప్పి రావడం, ఎక్కడ చూపించినా బాగు కాకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున కిరాణా షాపుకు వచ్చిన ఆయన షాపు పక్కనే ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఆటోకు నిప్పు

పుట్టపర్తి టౌన్‌: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఆటోకు నిప్పు పెట్టారు. వివరాలు.. ఎనుములపల్లికి చెందిన కరుణాకర్‌ గత సంవత్సరంలో రూ.మూడు లక్షలతో ఆటోను కొనుగోలు చేశాడు. గురువారం పగలు ఆటో నడిపి రాత్రి ఆటోను ఇంటి ముందు ఉంచాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆటోకు నిప్పుపెట్టారు. ఆటో 80 శాతం కాలిపోయింది. స్థానికులు గమనించి మంటలు ఆర్పారు. తమ జీవనాధారమైన ఆటోకాలిపోవడంతో కరుణాకర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై శుక్రవారం పుట్టపర్తి అర్బన్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

వరుణ దేవా.. కరుణించు !

రొద్దం: అదును దాటుతున్నా పదును కావడంలేదు.. వేసిన పంటలు ఎండముఖం పడుతున్నాయి. దీంతో వరుణుడి కరుణ కోసం ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామ సమీపంలో వెలసిన గ్రామదేవత బాట సుంకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షం కురిసే విధంగా చూడమ్మా అని వేడుకున్నారు. పూజల అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement