● ప్రతియేటా కొత్తదనంతో ముందుకు వస్తున్న మండప నిర్వాహకులు ● పోస్టర్ లాంచ్, థీమ్ వీడియోలతో మొదలైన సందడి
ట్రెండ్ సెట్టర్‌గా
హిందూపురం టౌన్: రాష్ట్రంలోనే గణేష్ ఉత్సవాల నిర్వహణలో హిందూపురం పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి వినాయక చవితికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నా ఇప్పటికే సందడి మొదలైంది. గణేష్ ఆగమనాన్ని ఘనంగా స్వాగతించేందుకు వివిధ మండపాల నిర్వాహకులు వినూత్న ఆలోచనలతో పోస్టర్ లాంచ్, ఏఐ ఆధారిత కాన్సెప్ట్ వీడియోలను విడుదల చేసి అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
గతానికి భిన్నంగా...
గతంలో సాధారణ పోస్టర్లతో సరిపెట్టుకున్న నిర్వాహకులు ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. ప్రతి మండపం తమ ప్రత్యేకతను చాటిచెప్పేలా కొత్త కాన్సెప్ట్‌ను రూపొందిస్తూ.. తాము ప్రతిష్ఠించబోయే వినాయక విగ్రహం ఎలా ఉండబోతోంది, మండప అలంకరణ ఎలా ఉండనుంది, ఈ ఏడాది థీమ్ ఏమిటి అనే అంశాలను అత్యాధునిక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సినీ ట్రైలర్‌ను తలపించేలా వీడియోలను ఆవిష్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో వీటికి ఎంతో ఆదరణ లభిస్తోంది.
థియేటర్‌లో లాంచింగ్‌లు
తమ మండపం అందరికంటే భిన్నంగా కనిపించాలనే ఉద్దేశంతో ఎవరికి వారు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. గత ఏడాది ముక్కడిపేటలోని యువసేన వినాయక మండప నిర్వాహకులు తమ వినాయకుడి పోస్టర్ లాంచ్‌ను థియేటర్లో నిర్వహించి ట్రెండ్ సెట్ చేశారు. అలాగే ప్రస్తుతం కట్టకింద ఏర్పాటు చేసే మహాగణాథిపతి సేవా సమితి వినాయకుడి మండప నిర్వాహకులు ఏకంగా ఏఐ సాంకేతికతో సినిమా ట్రైలర్ తరహాలో థీమ్‌ను సిద్ధం చేసి సినిమా థియేటర్‌లో విడుదల చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియో తెగ వైరల్‌గా మారి ఏకంగా 7 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ముక్కడిపేటలోని యువసేన వినాయకుడి పోస్టర్ లాంచ్ సైతం నిర్వాహకులు ఒక చిన్నపాటి సినిమా సెట్ తలపించేలా ఏర్పాటు చేసి వేడుకలా నిర్వహించారు. సామాజిక మాధ్యమంలోనూ లక్షల్లో వ్యూస్ సాధించింది. అలాగే త్యాగరాజ్‌నగర్‌లో ప్రతిష్ఠించే విశ్వసేన వినాయక మండప నిర్వాహకులు పోస్టర్ లాంచ్‌ను ఘనంగా చేశారు.
రూ.3 కోట్ల దాకా ఖర్చు
హిందూపురంలో ప్రతి ఏడాది దాదాపు 200కుపైగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. భారీ విగ్రహాలు, ఆకర్షణీయమైన మండపాలు, వైవిధ్యమైన థీమ్‌లతో పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఉత్సవాల చివరి రోజు జరిగే మహా నిమజ్జన శోభాయాత్ర రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. భారీ డీజేలు, కనువిందు చేసే విద్యుత్ అలంకరణలు, రంగురంగుల లైటింగ్, ప్రదర్శనలు, వివిధ రకాల దుస్తులు ధరించి నృత్యాల మధ్య నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. హిందూపురం మాత్రమే కాకుండా పరిసర మండలాలు, అనంతపురం, పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా వేలాదిగా ప్రజలు ఈ వేడుకలను తిలకించేందుకు తరలివస్తుంటారు. ప్రతి ఏడాది ఉత్సవాల నిర్వహణ కోసం రూ.3 కోట్లకు పైగా వ్యయం చేస్తున్నట్లు అంచనా. ఈసారి కూడా విగ్రహాలు, అలంకరణలు, లైటింగ్, శోభాయాత్ర ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు.


