పెనుకొండ రూరల్ (సోమందేపల్లి): మేళతాళాలు...భక్తుల పూనకాలతో చౌడేశ్వరీదేవి బోనాల ఉత్సవం వైభవంగా సాగింది. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని బుధవారం సోమందేపల్లి గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని అమ్మవారిని స్మరిస్తూ ముందుకుసాగారు. ప్రధాన రహదారుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. చిన్నారులు, మహిళలు అమ్మవారి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేశారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు.


