కదిరి అర్బన్/తనకల్లు: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులంతా ప్రత్యామ్నాయ పంటలే సాగుచేసుకోవాలని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డా. పీవీ సత్యనారాయణ సూచించారు. ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో రైతుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఆయన బుధవారం కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానానికి విచ్చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. సుమతి, డా. జయలక్ష్మి, డా. సంపత్‌కుమార్‌తో కలిసి పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. గత జూన్‌లో ఎక్కువ వర్షపాతం నమోదుకావడంతో రైతులు వర్షాధార పంటల సాగు చేశారని, కానీ జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే సాగులో ఉన్న పంటలు బెట్టతట్టుకునేందుకు రైతులకు సలహాలిచ్చామన్నారు. కొత్తగా పంటలు సాగుచేయాలనుకునే వారు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. కార్యక్రమంలో కదిరి వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు డాక్టర్ పీవీ సత్యనారాయణ, శాస్త్రవేత్తలు తనకల్లు మండల పరిధిలోని పరాకువాండ్లపల్లిలో ఎల్–నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో పండే కొర్ర, సజ్జ, జొన్న తదితర పంటలను సాగు చేసుకోవడం ఉత్తమమన్నారు. నీటి వృథాను అరికట్టడానికి డ్రిప్ సాంకేతికతపై అవగాహనను పెంచుకోవాలన్నారు. అనంతరం ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సిన శాసీ్త్రయ సాగు విధానాలను, డ్రై ల్యాండ్ టెక్నాలజీ, వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు నిర్వహణ పద్ధతులను వివరించారు.
రైతులకు ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ సూచన


