తనకల్లు: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా...భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. బావులు, చెరువులు, కుంటలు నీరు సైతం ఇంకిపోగా, బోర్ల నుంచి కూడా నీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది రైతులు పొలాలను బీళ్లుగా వదిలేశారు. అయితే ఏళ్లుగా ఉద్యానతోటలు సాగుచేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 15 నుంచి 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి చెట్లు సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే కుదేలైన మామిడి రైతులు...అష్టకష్టాలు పడి రూ. లక్షలు ఖర్చు చేసి పెంచిన మామిడిచెట్లు కళ్ల ముందే ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ట్యాంకర్లతో నీటి సరఫరా..
తనకల్లు మండలంలో రైతులు ఏళ్లుగా మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ఈ ఒక్క మండలంలోనే దాదాపు 1,200 ఎకరాలకు పైగానే మామిడి తోటలున్నాయి. అయితే వర్షాలు లేకపోవడం, వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటిపోవడంతో మామిడి తోటలకు నీరు అందక ఎండిపోతున్నాయి. ట్యాంకర్లతో తోటలకు నీరు అందించాలంటే ఒక్కో ట్యాంకర్‌కు రూ. 1,000కి పైగా చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో చేసేది లేక ఎండిపోయిన మామిడి చెట్లను తొలగించుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్యాంకర్లతో తోటలకు నీటిని అందించి ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.
ఎల్–నినోతో తీవ్ర వర్షాభావం.. అడుగంటిన భూగర్భ జలం
నీరందక ఎండిపోతున్న
మామిడి తోటలు
చెట్లను కాపాడుకునేందుకు
ట్యాంకర్లతో నీటి సరఫరా
ఒక్కో ట్యాంకర్ నీరు రూ.1000 ప్రకారం కొంటున్న రైతులు


