● పెనుకొండ సీహెచ్‌సీ తనిఖీలో
కలెక్టర్ శ్యాంప్రసాద్ అసహనం
● సేవలు, సౌకర్యాల కొరతపై
డీసీహెచ్‌ఎస్‌కు మెమో
పెనుకొండ రూరల్: ‘‘దీన్ని ఆస్పత్రి అంటారా.. సౌకర్యాలు మరీ ఇంత అధ్వానమా.. సేవలు ఇంతదారుణంగా ఉంటే ఎలా.. అసలు ఆస్పత్రి పర్యవేక్షణను ఎవరైనా పట్టించుకుంటున్నారా’’ అంటూ కలెక్టర్ శ్యాంప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పెనుకొండలోని సీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. వార్డులు, ఫార్మసీ, ఎక్స్‌రే గదులు, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. వైద్యులు అందిస్తున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ట్రామా కేర్ సెంటర్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఓపీ సేవలను పరిశీలించారు. సౌకర్యాలు, సేవలపై అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడిని చేస్తూ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్)కు మెమో ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. మరో నెల తర్వాత తాను మళ్లీ ఆస్పత్రిని సందర్శిస్తానని ఆలోపు ఆస్పత్రిలోని సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. ఆస్పత్రి ఆవరణలోని సీమాంక్ సెంటర్‌కు అవసరమైన వసతులు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. నూతన మార్చురీ గది నిర్మాణం, నిరుపయోగంగా ఉన్న 104 వాహనాన్ని మహాప్రస్థానం వాహనంగా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రి ఆవరణం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆస్పత్రి కారిడార్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ మోహన్ నాయక్, తహసీల్దార్ స్వాతి, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.


