కనగానపల్లి: ప్రసుత్తం నెలకొన్న ఎల్‌నినో వాతావరణ పరిస్థితులను అధిగమించేలా వ్యవసాయ ప్రణాళికలు, పంటల సాగులో మార్పులు చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితులతో వర్షాలు సరిగారాక దెబ్బతిన్న ఖరీఫ్ పంటలను పరిశీలించేందుకు మంగళవారం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం మండలంలో పర్యటించింది. వేపకుంట, తగరకుంట, కనగానపల్లి, ముక్తాపురం గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో తిరిగి వర్షాభావానికి దెబ్బతిన్న వేరుశనగ, ఆముదం, కంది, జొన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు విజయశంకర్, రాధాకుమారి, నరసింహులు, నారాయణస్వామి మాట్లాడుతూ బెట్టను తట్టుకొనే స్వల్పకాలిక పంటలు, విత్తనాల రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రస్తుతం బెట్టకు గురైన పంటను కాపాడుకొనేందుకు రైతులు రక్షక తడులు అందించటంతో పాటు పోటాషియం నైట్రేట్ 5 గ్రా. లేదా 19:19:19ను 10 గ్రా. లీటరు నీటిలో కలుపుకొని పంటలపై పిచాకారీ చేసుకోవాలన్నారు. ఇది కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్దతిలో ద్రవ జీవామృతాలను కూడా పంటలపై పిచికారీ చేసుకోవాలన్నారు. వీటిద్వారా 15 రోజుల వరకు పంట ఎండిపోకుండా చేసుకోవచ్చునన్నారు. బీడుగా ఉన్న భూములలో వచ్చే వర్షాలకు అనుగుణంగా స్వల్పకాలిక రకాలైన కొర్ర, సజ్జలు, పెసర. ఉలవ, మినుము పంటలు సాగు చేసుకోవాలన్నారు. ఏఓ మాధురి, ఎఫ్‌ఎంటీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


