అక్కను వేధిస్తున్నాడని బావను హతమార్చారు | - | Sakshi
Sakshi News home page

అక్కను వేధిస్తున్నాడని బావను హతమార్చారు

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

తనకల్లు: అక్కను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న బావను బావమరుదులే హతమార్చారు. బుధవారం కదిరి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివనారాయణస్వామి వివరాలను వెల్లడించారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన సునీల్‌ సీతారై, సంజీవ్‌ సీతారై అన్నదమ్ములు. వీరు తనకల్లు మండలంలోని చీకటిమానిపల్లి వద్ద ఉన్న ఆత్మికా పేపర్‌ మిల్‌లో కూలీలుగా పనిచేయడానికి వచ్చారు. వీరికి సుమిత్రా సితారై అనే అక్క ఉంది. ఆమెను అదే రాష్ట్రానికి చెందిన మంద్రాజ్‌ థతేరా అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. మంద్రాజ్‌ థతేరా తన భార్య సుమిత్రా సితారైను తరచూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో థతేరాను ఎలాగైనా చంపాలని సునీల్‌ సీతారై, సంజీవ్‌ సీతారై నిర్ణయించుకున్నారు. పేపర్‌ ఫ్యాక్టరీలో పని ఇప్పిస్తామని బావను నమ్మబలికి జూలై 24న జార్ఖండ్‌ నుంచి రప్పించారు. తర్వాతి రోజు రాత్రి 11 గంటల సమయంలో తమ స్నేహితులైన సింగారి సితారై, బసు బాల్ముచు, జెనారామ్‌ తిరియాతో కలిసి మంద్రాజ్‌ థతేరాకు మద్యం తాగించి పడమటివారిపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. మంద్రాజ్‌ థతేరాను రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి కొంతదూరంలో ఉన్న కానుగ చెట్టు వద్ద పడేసి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో గత నెల 28న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో బావ మంద్రాజ్‌ థతేరాను బావమరుదలు తమ స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు. కదిరి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

హత్య కేసులో ఐదుగురి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement