ప్రశాంతి నిలయం: ఎన్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగు, సాగునీటి ఎద్దడి నెలకొంటోందని, వెంటనే ప్రాజెక్ట్‌లకు నీటిని వదిలి ప్రజలను రక్షించాలని జలసాధన సమితి నాయకుడు శ్రీనివాసులు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓను కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగు, సాగు నీటికి హంద్రీ–నీవా జలాలే శరణ్యమన్నారు. వెంటనే కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి కృష్ణా జలాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఉత్పత్తి పేరుతో కిందికి వదిలివేస్తున్నారని, డెల్టా ప్రాంతానికి సాగునీరు అందిస్తున్నారని, కానీ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీరు వదలడం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా రాయలసీమలో 14 లక్షల ఎకరాలకు సాగునీరు, రాయలసీమ, చైన్నె నగరంలో కోటి మందికి తాగునీరు అందే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 11లో తాగు, సాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే విద్యుత్ ఉత్పత్తికి వాడాలని స్పష్టంగా తెలియజేశారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని వెంటనే నీటిని ప్రాజెక్ట్‌లకు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి ఖాసీం, సుధాకర్, సురేష్, చెన్నకేశవులు, ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


