ప్రశాంతి నిలయం: అమరావతి చాంపియన్స్ కప్‌లో భాగంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 7 నుంచి 12 దాకా మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. 7న పెనుకొండలోని కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, 11న హిందూపురం మండలం కె.బసస్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. 12న ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హాకీ, ఆర్చరీ, యోగా, బాక్సింగ్, చెస్, బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయానికి వేదిక వద్ద హాజరు కావాలని కోరారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
కేజీబీవీ ప్రిన్సిపాల్, టీచర్‌పై వేటు
పుట్టపర్తి: ‘వివాదాలకు కేరాఫ్‌గా ఎన్‌పీ కుంట కేజీబీవీ’ అన్న శీర్షికన ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై ప్రత్యేక కమిటీ విచారణ జరిపి డీఈఓ కిష్టప్పకు రిపోర్టు అందించింది. ఇందులో భాగంగానే ప్రిన్సిపాల్ రెహానా, హిందీ టీచర్ రూపారాణిపై వేటు పడింది. పాఠశాల విద్యార్థులతో అమర్యాదగా ఉండడం, వచ్చిన నిధులను సద్వినియోగం చేయక పోవడం, నిధులు పక్కదారి పట్టడంతో ప్రిన్సిపాల్, టీచర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా విధి నిర్వహణలో అలసత్వం, ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్లు తేలడంతో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు ఇద్దరి కాంట్రాక్ట్ సేవలను రద్దు చేశామన్నారు.


