ప్రశాంతి నిలయం: గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు శిక్షణ అందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో ఒప్పందం కుదిరిందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఏడాది పాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు కుమార్ నాయక్, కుమార్ నాయుడు, ప్రవీణ్ కుమార్‌లతో ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ప్రతిభలో ఎవరికి తీసిపోరన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ.. ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి మోహన్ నాయక్, బీసీ సంక్షేమశాఖ ఆధికారి రాజేంద్రకుమార్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీరాములునాయక్, గురుకుల పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.


