మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థి
అనంతపురం సిటీ: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత జిల్లాలోని ఓడీచెరువు గ్రామ ఎస్సీ బాలుర సమీకృత వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న లక్ష్మీనరసింహ(14) రోడ్డు ప్రమాదానికి గురై పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. అయితే బాలుడి మృతదేహానికి ఆగమేఘాలపై పోస్టుమార్టం నిర్వహించి, స్వగ్రామానికి తరలించాలంటూ మెడికల్ కళాశాల హెచ్‌ఓడీ ఒత్తిడి మేరకు అందించిన వైద్య సేవలపై పలు అనుమానాలు రేకెత్తాయి. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు చేరుకుని మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. మరణించిన బాలుడి తండ్రి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం ఎలా చేస్తారని నిలదీశారు. దీంతో మార్చురీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రంగంలోకి విద్యార్థి సంఘం నాయకులు
విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులతో పాటు ఏఐఎస్‌ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గిరి, ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ వెంటనే ఆస్పత్రి మార్చురీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని గమనించారు. మరణించిన విద్యార్థి తండ్రి పూజారి శివానందతో కలసి మార్చురీ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. మంత్రి సవితతో పాటు మెడికల్ కళాశాలకు చెందిన కీలక అధికారి తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించి విద్యార్థి ప్రాణాలు కాపాడాల్సిన కనీస బాధ్యతను విస్మరించిన మంత్రి సవితను వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థి మృతికిఇ కారకులైన వార్డెన్, సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని పట్టుబట్టారు. అంత వరకు ఇక్కడి నుంచి మృతదేహాన్ని తరలించే ప్రసక్తే లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
ఏం జరిగిందంటే..
గోరంట్ల మండలం కమ్మవారిపల్లికి చెందిన పూజారి శివానంద కుమారుడు లక్ష్మీనరసింహ ఓడీచెరువులోని ఎస్సీ బాలుర సమీకృత వసతి గృహంలో ఉంటూ అక్కడి జెడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదివేవాడు. ఈ నెల 14న అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండడంతో ప్రసాదం తీసుకురావాలని లక్ష్మీనరసింహ, ఎనిమిదో తరగతి విద్యార్థి భార్గవ్‌కు వార్డెన్ కృష్ణానాయక్, కమాటీ గురుప్రసాద్, వాచ్‌మెన్లు అఖిల, బాలమ్మ పురమాయించి, వారి ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి పంపారు. కదిరి–హిందూపురం మధ్య కొత్తగా వేస్తున్న నాలుగు వరుసల రహదారిపై వెళ్తుండగా ఎం.కొత్తపల్లి సమీపంలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో విద్యార్థులిద్దరూ గాయపడ్డారు. వీరిని వెంటనే 108లో కదిరిలోని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. లక్ష్మీనరసింహ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని పెద్దాస్పత్రికి రెఫర్ చేశారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించి తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని తండ్రి రెండు చేతులెత్తి మొక్కినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు పసివాడి ప్రాణం బలైంది. మంగళవారం ఉదయం సర్వజనాస్పత్రిలో లక్ష్మీనరసింహ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత వార్డెన్ సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. అంతటితో తన పనైపోయిందని భావించిన ఆమె ఆ తర్వాత విద్యార్థి పరిస్థితిని పట్టించుకున్న పాపాన పోలేదు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఇలాకాలో ఈ నెల 14న ప్రమాదానికి గురైన హాస్టల్ విద్యార్థులు
వార్డెన్, మరో ముగ్గురి సస్పెన్షన్‌తో చేతులు దులిపేసుకున్న మంత్రి
పది రోజులుగా అనంతపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం విద్యార్థి మృతి
ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత
మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థి


