ఇత్తడి సామగ్రి మెరుగు పేరుతో పుత్తడి అపహరణ
ఉరవకొండ: ఇత్తడి పూజా సామగ్రిని మెరుగు పెడుతామంటూ నమ్మబలికి ఓ మహిళ మెడలోని బంగారం మాంగళ్యం చైన్‌ను అపహరించుకెళ్లిన ఘటన ఉరవకొండ మండలం నింబగల్లులో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన బాబు, స్వరూప దంపతుల ఇంటి వద్దకు బుధవారం ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు. ఇత్తడి సామగ్రికి మెరుగు పెడతామనడంతో స్వరూప తన ఇంట్లోని సామగ్రిని అందజేసింది. వాటిని మెరుగు పెట్టిన తర్వాత ఆమె మెడలోని బంగారం మాంగల్యం చైన్ కూడా మెరుగు పెడతామని నమ్మబలికారు. అయితే దంపతులు అంగీకరించకపోవడంతో నమ్మకం లేకపోతే ఈ ప్యాకెట్‌లో ఉన్న పౌడర్ తీసుకెళ్లి గిన్నెలో నీరు పోసి కొద్ది సేపు ఉంచాలని ఓ ప్యాకెట్‌ను అందించారు. దీంతో వంటగదిలోకి వెళ్లి తన మాంగల్యం చైన్ తీసి వారు ఇచ్చిన పౌడర్‌లో వేసి పరిశీలిస్తుండగా అక్కడకు చేరుకున్న ఆగంతకులు తాము కూడా చూస్తామంటూ ఒక్కసారిగా బంగారం చైన్ తీసుకుని దంపతులను పక్కకు తోసి ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
నదిలో స్నానానికి వెళ్లి
మృత్యు ఒడికి
● సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంట
తీవ్ర విషాదం
● శబరిమల నుంచి
తిరిగివస్తుండగా ఘటన
గార్లదిన్నె: అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లి తిరుగుపయనంలో నదీ స్నానానికి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నీటమునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో అతని స్వగ్రామం గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. ఎం.కొత్తపల్లికి చెందిన మల్లికార్జున, సరళ దంపతుల కుమారుడు నందకుమార్ (27) పుణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న బెంగళూరు నుంచి తన స్నేహితులతో కలసి శబరిమలకు వెళ్లి అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. మంగళవారం తిరుగు ప్రయనమయ్యాడు. శబరిమల నుంచి 50 కిలో మీటర్లు దూరం దాటాక నది కనిపించడంతో అక్కడ స్నేహితులతో కలిసి నందకుమార్ స్నానానికి దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి పైకిరాలేకపోయాడు. తోటి స్నేహితులు విఫలయత్నం చేసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి గజ ఈతగాళ్లతో నదిలో వెతికించి నందకుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. బుధవారం నందకుమార్ మృతదేహాన్ని స్వగ్రామం ఎం.కొత్తపల్లికి తీసుకురాగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. దీంతో అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.


