ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
కదిరి టౌన్: పట్టణంలో ద్విచక్ర వాహనాల వరుస అపహరణలకు కారణమైన యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. కదిరి ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన ద్విచక్ర వాహనాలు అపహరణకు గురైనట్లుగా ఇటీవల పలువురు ఫిర్యాదు చేశారు. ఆయా ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో బుధవారం కుటాగుళ్ల రైల్వే గేట్ వద్ద పల్లెపు అశోక్‌బాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించాడు. దాచి ఉంచిన ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
‘ఉమ్మడిశెట్టి అవార్డు’కు
కవితల ఆహ్వానం
అనంతపురం కల్చరల్: ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–25’కు గాను కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అవార్డు వ్యవస్థాపకుడు, సీనియర్ కవి డాక్టర్ రాధేయ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025లో ప్రచురించిన కవితా సంపుటాలను జనవరి 10వ తేదీలోపు ‘డాక్టర్ రాధేయ, చైర్మన్, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్టు, 13–1–606–1, షిరిడినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం – 515001’ చిరునామాకు పంపాలి. ఎంపికై న కవిని నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించనున్నారు. పూర్తి వివరాలకు 99851 71411లో సంప్రదించవచ్చు.
హోర్డింగ్ మీద పడి
వృద్ధురాలి మృతి
కదిరి టౌన్: హోర్డింగ్ మీద పడడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కదిరి మండలం కదిరికుంట్లపల్లికి చెందిన గంగులమ్మ (60) వ్యక్తిగత పనిపై కదిరికి వచ్చి అంబేడ్కర్ సర్కిల్‌లోని ఓ మొబైల్ షాపు వద్ద కూర్చొని ఉండగా పైనుంచి ఇనుప హోర్డింగ్ మీదపడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి బుధవారం ఆమె మృతి చెందింది. మృతురాలి కుమార్తె విమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
శ్రీగంధం చెట్ల నరికివేత
బత్తలపల్లి: మండలంలోని సంజీవపురం గ్రామంలో రెండు శ్రీగంధం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. గ్రామానికి చెందిన నీలిమా ఆరేళ్ల క్రితం శ్రీగంధం మొక్కలను నాటారు. అందులో బొప్పాయి, ఇతర పంటలనూ అంతర సాగుగా చేపట్టారు. ప్రస్తుతం ఏపుగా పెరిగిన శ్రీగంధం రెండు చెట్లను దుండగులు మంగళవారం రాత్రి నరికి ఎత్తుకెళ్లారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు బుధవారం ఎస్‌ఐ సోమశేఖర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
చెట్టు మీద నుంచి
జారి పడి వ్యక్తి మృతి
వజ్రకరూరు: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి వజ్రకరూరు మండలం ఎన్‌ఎన్‌పీ తండా నివాసి రమావత్ శంకర్‌నాయక్ (40) మృతి చెందాడు. ఆయనకు భార్య పార్వతి, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో పాటు జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మేకలకు ఆహారం కోసమని ఇంటి వద్ద వేపచెట్టు ఎక్కి ఆకులు కోస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్సకు స్పందించక బుధవారం ఉదయం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి దుర్మరణం
బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బోరంపల్లికి చెందిన బొజ్జప్ప (45) బుధవారం యర్రగుడి గ్రామంలో జరిగిన దేవరకు వచ్చి, మొక్కు తీర్చుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ముదిగల్లుకు చెందిన దేవ అనే వ్యక్తి ఢీకొనడంతో రోడ్డుపై పడి బొజ్జప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దేవాను స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చారు.
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్


