
అశ్లీల సందేశాలు ఫార్వర్డ్ చేసినందుకు కటకటాలు
● నటి రమ్య కేసులో మరో వ్యక్తి అరెస్ట్
యశవంతపుర: కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో మరో నిందితుడు పట్టుబడ్డాడు. విజయపురకు చెందిన సంతోష్ అనే నిందితుడిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను సిమెంట్ పనిచేసేవాడని, దర్శన్ విషయంపై రమ్య వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అశ్లీల సందేశాలను చదివి అనేక మందికి ఫార్వర్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అశ్లీల సందేశాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో సంతోష్ తన సెల్‌ఫోన్ ఆఫ్ చేశాడు. అయితే ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు.
కూలిన చెట్ల తొలగింపు
గౌరిబిదనూరు: పట్టణంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చెట్లు నేలకూలాయి. 21 వార్డు మునేశ్వర కాలనీ, అరవింద నగరలో రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాలు, పాదచారుల సంచారానికి ఇబ్బందిగా మారింది. మాజీ మున్సిపల్ సభ్యుడు అనంతరాజు స్పందించి అటవీశాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, పౌరకార్మికుల సహకారంతో కూలిన చెట్లను తొలగింపజేశారు. అటవీశాఖ అధికారి యల్లప్ప, వాజీరావ్, నాగేశ్, నరసింహమూర్తి ,శ్రీనివాస్ తిమ్మరాజు పాల్గొన్నారు.
గూడ్స్ ఆటో బ్యాటరీలు చోరీ
మైసూరు : మైసూరులో దొంగలు చెలరేగారు. మహానగర పాలికెకు చెందిన ఎనిమిది గూడ్స్ ఆటోలకు చెందిన బ్యాటరీలను చోరీ చేశారు. కుంబారకొప్పలులో చెత్త సేకరణ కోసం గూడ్సు ఆటోలు ఏర్పాటు చేశారు. సోమవారం చెత్త సేకరణ ముగిసిన అనంతరం వాహనాలను పార్కింగ్ చేసి వెళ్లారు. ఉదయం వచ్చి చూడగా ఆటోల బ్యాటరీలు కనిపించలేదు. సమాచారం అందుకున్న వాహనాల విభాగం ఇంజినీర్ మైత్రి మెటెగళ్లి వచ్చి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
బాలుడికి బైక్..
తల్లిదండ్రులకు జరిమానా
మైసూరు : మైనర్‌కు బైక్ ఇచ్చిన తల్లిదండ్రులకు కోర్టు జరిమానా విధించింది. ఈఘటన మైసూరు జిల్లా పిరియాపట్టణలో చోటు చేసుకుంది. ఐదు నెలల క్రితం 17 సంవత్సరాల బాలుడు బైక్ నడుపుతుండగా బైలుకుప్పె పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ఈకేసు కోర్టులో విచారణకు వచ్చింది. బాలుడికి బైక్ ఇచ్చిన తల్లిదండ్రులకు రూ.25వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
కృష్ణాష్టమి వేడుకలపై సమీక్ష
గౌరిబిదనూరు: కృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రభుత్వపరంగా ఘనంగా ఆచరించాలని మంచేనహళ్లి శ్రీ రాధాకృష్ణ యాదవ క్షేమాభివృద్ధి ట్రస్ట్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల నిర్వహణపై తహసీల్దార్ పూర్ణిమ అధ్యక్షతన సోమవారం తాలూకా కార్యాలయంలో జరిగిన సమావేశం జరిగింది. కృష్ణ జన్మాష్టమి ప్రభుత్వ పరంగా జరపడానికి నిధులు రాలేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. కృష్ణ దేవాలయం, సముదాయ భవనం నిర్మాణానికి స్థలం గుర్తించి జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు. సమావేశంలో గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యాధ్యక్షుడు హరీశ్‌కుమార్, కార్యదర్శి రవిశంకర్, ముత్తేగౌడ, లగుమప్ప, చంద్రప్ప, లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు.
ఘనంగా శ్రీగురురాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం
బొమ్మనహళ్లి : దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళలోని వగ్గ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కాడబెట్టు గ్రామంలో పిలింగాలు గాయత్రీదేవి దేవాలయంలో గురురాఘవేంద్ర స్వామి ఆరాధనన మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి మూల బృందావనానికి మంగళవారం ఉదయం పంచామృత అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. మహా మంగళహారతి అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మండలి ధర్మకర్త కే.ఎస్.పండిత్, ఉత్సవ సమితి మాజీ అధ్యక్షుడు యశోధర శెట్టి, దండె ధర్మస్థల గ్రామీణాభివృద్ధి పథకం, సేవా ప్రతినిధి రేఖా పిలింగాలు, పిలాతబెట్టు గ్రామపంచాయతీ ఉపాధ్యక్షుడు ఎం.బాబా సాఫల్య పాల్గొన్నారు.

అశ్లీల సందేశాలు ఫార్వర్డ్ చేసినందుకు కటకటాలు

అశ్లీల సందేశాలు ఫార్వర్డ్ చేసినందుకు కటకటాలు