
21 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మోస్తరు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా 106.04 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 10.2 మి.మీ, పుట్టపర్తి మండలంలో 10 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. అలాగే తాడిమర్రి మండలంలో 9.2 మి.మీ, ఎన్‌పీకుంట 9.0, హిందూపురం 8.4, తలుపుల 6.8, ముదిగుబ్బ 6.4, రొళ్ల 6.4, కనగానపల్లి 4.6, రామగిరిలో 4.2, అగళి 4, లేపాక్షి 4, కదిరి 3.8, చెన్నేకొత్తపల్లి 3.2, గుడిబండ 3 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్ల అధికారులు వెల్లడించారు. కొత్తచెరువు, ధర్మవరం, గాండ్లపెంట, మడకశిర, తనకల్లు, బుక్కపట్నం మండలాల్లో తుంపర వర్షం కురిసిందని తెలిపారు. తాజా వర్షాలతో పుట్టపర్తి మండలంలోని గాజులపల్లి చెరువు నిండి మరువ పారుతోంది. ఇక సాహెబ్ చెరువు, చెర్లోపల్లి చెరువుల్లోకి నీళ్లు చేరాయి.
మడకశిరలో
ఎలుగుబంట్ల సంచారం
● భయాందోళనలో ప్రజలు
మడకశిర: పట్టణ శివారులో ఎలుగుబంట్ల సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. మంగళవారం ఉదయం చౌటిపల్లి సమీపంలో ఓ గ్యాస్ గోదాము వద్ద రెండు ఎలుగుబంట్లు కనిపించడంతో కలకలం రేగింది. దీంతో స్థానికులు అటువైపు వెళ్లేందుకే భయపడిపోయారు. పట్టణానికి సమీపంలోని కొండ పైనుంచి ఎలుగుబంట్లు శివారులోని కాలనీల్లోకి వస్తున్నాయి. ఇటీవలే ఓ ఎలుగుబంటి రాత్రి వేళ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో కనిపించిన విషయం తెలిసిందే. ఎలుగుబంట్లు జనావాసాల్లో సంచరిస్తూ భయపెడుతున్నా స్థానిక అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా ఎలుగుబంట్ల బెడదను నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వీఆర్‌కు ఎస్‌ఐ రాజశేఖర్
● ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ రత్న
● విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి
పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్‌ఐ రాజశేఖర్‌పై వేటు పడింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్‌కు పంపారు. అలాగే ఎస్‌ఐ రాజశేఖర్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబంఽధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పట్నం ఎస్‌ఐగా జయరాంనాయక్
‘పట్నం’ ఎస్‌ఐగా కె. జయరాంనాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్‌ఐగా ఉన్న రాజశేఖర్‌ను వీఆర్‌కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న జయరాంనాయక్‌ను నియమించారు.

21 మండలాల్లో వర్షం

21 మండలాల్లో వర్షం