
రైతులకు రాజకీయ రంగు పులమొద్దు
అనంతపురం సిటీ: రైతులకు రాజకీయ రంగు పులిమి సంక్షేమాన్ని అందకుండా చేయడం దారుణమని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన రైతులందరికీ అన్నదాత–సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్‌లో బుధవారం నిర్వహించిన స్థాయీ సంఘం–1, 2, 3, 4 5, 6, 7 సమావేశాలకు గిరిజమ్మ అధ్యక్షత వహించారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభం కాగానే యూరియా కొరతపై అధికారులను గిరిజమ్మ నిలదీశారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ఎందుకు దృష్టి సారించలేకపోయారంటూ ప్రశ్నించారు. అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, నల్లమాడ జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, భాస్కర్, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి సైతం వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తే.. అదే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత–సుఖీభవ పథకం కింద ఇవ్వాల్సిన రూ.5 వేలను కొందరికి మాత్రమే జమ చేసి మిగిలిన వారికి మొండి చెయ్యి చూపిందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులుగా ముద్రవేసి రైతులకు అన్యాయం చేయడం భావ్యం కాదన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతులకు ఉచితంగా ఇచ్చే శాంపిల్స్ వేరుశగన కిట్లు వ్యవసాయ శాఖ అధికారులే బయట అమ్ముకున్నారంటూ డి.హీరేహాళ్ జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాభాను ఆరోపించారు.
తల్లికి వందనం అమలులో వంచన చేస్తారా?
విద్యార్థులందరికీ తల్లికి వందనం అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని జెడ్పీటీసీలు వేదాంతం నాగరత్నమ్మ, భాస్కర్, చంద్రకుమార్ ఆరోపించారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం అమలు వివరాలు ఇవ్వాలని అడగ్గా విద్యా శాఖ అధికారులు చేతులెత్తేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం చాలా దారుణంగా ఉంటోందని, పిల్లలకు పురుగులు పడిన, ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డించడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశానికి ఆర్‌ఐఓ రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలను ఆయా శాఖాధిపతులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సభ్యులు కోరారు. చిలమత్తూరు జెడ్పీ హైస్కూల్‌లో తాగునీటి కొరతతో విద్యార్థులు అల్లాడిపోతున్నారని సభ దృష్టికి జెడ్పీటీసీ సభ్యురాలు అనూష తెచ్చారు. సమావేశంలో సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ