
ప్రమాదంలో పాస్టర్ మృతి
ఓడీచెరువు (అమడగూరు): వాహనం బోల్తాపడిన ఘటనలో ఓ చర్చి ఫాదర్ మృతి చెందారు. వివరాలు.. ఓడీచెరువులోని చర్చి ఫాదర్ దేవదాస్ (37) బుధవారం ఓడీచెరువు మండలంలోని డబూరువారిపల్లి, ఎం.కొత్తపల్లి, ఓడీచెరువుకు చెందిన కూలీలతో కలసి బొలెరో వాహనంలో అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని ఓ రైతు పొలానికి బయలుదేరారు. అమడగూరు మండలం మహమ్మదాబాద్ సమీపంలోకి చేరుకోగానే వాహనం బోల్తాపడింది. పాస్టర్ దేవదాస్, డబూరువారిపల్లికి చెందిన ఆంజనేయులు, ఎం.కొత్తపల్లికి చెందిన ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కదిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పాస్టర్ దేవదాస్ మృతి చెందారు. ఆయనకు భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విద్యుదాఘాతంతో మహిళ..
ఓడీచెరువు: మండలంలోని గాజుకుంటపల్లికి చెందిన హజీరా (53) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో గృహోపకరణానికి ఫ్లగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ ప్రసరించి షాక్‌కు గురై గట్టిగా కేక వేస్తూ కుప్పకూలింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఓడీ చెరువులోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్‌లో కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
వ్యక్తి బలవన్మరణం
పెనుకొండ రూరల్: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ మండలం మావటూరు గ్రామానికి చెందిన సంజీవప్ప (40)కు భార్య ముత్యాలమ్మ, ఓ కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. బుధవారం ఉదయం నొప్పి తీవ్రత తాళలేక గ్రామ సమీపంలోని మల్బరీ షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రమాదంలో పాస్టర్ మృతి