
టీచర్లకు మోత... నేతలకు మేత
టీచర్లకు భారమే
మూల్యాంకన పుస్తకాలు పిల్లలకే కాదు..టీచర్లకు కూడా భారమే. అన్ని పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లడం కుదరదు..అలాగని తరగతి గదిలో కూర్చొని వాటిని దిద్దడం కుదరదు. ఇది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే.
– బడా హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు,
ఏపీటీఎఫ్ 1938
కదిరి: సంస్కరణల పేరిట కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఫలితంగా విద్యా ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఇప్పటికే బోధనేతర పనులతో టీచర్లు సతమతమవుతుంటే తాజాగా ప్రభుత్వం సరఫరా చేసిన పరీక్షల అసెస్మెంట్ పుస్తకాలు గురువులకు కోపం తెప్పిస్తున్నాయి. సంస్కరణల మాట దేవుడెరుగు..కొందరు కూటమి నేతల జేబులు నింపడానికే ఈ పుస్తకాలను సరఫరా చేసినట్లు కనబడుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటి ద్వారా టీచర్లపై మూల్యాంకన భారం పడటంతో పాటు విద్యార్థులకు సైతం తీరని నష్టం జరుగుతుందని వారంటున్నారు.
పరీక్ష కోసం ఒక్కో సబ్జెక్టుకు ఒక పుస్తకం..
జూన్, జూలై మాసాల సిలబస్‌పై విద్యార్థుల అభ్యసన మదింపు కోసం ఈనెల 11 నుంచి ప్రారంభమైన ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్‌ఏ–1) పరీక్షలు బుధవారం నాటికి 1–7 తరగతుల విద్యార్థులకు ముగిశాయి. 8, 9, 10 తరగతులకు గురువారం ఉదయం జరిగే బయాలజీ పరీక్షతో ముగుస్తాయి. గతంలో పిల్లలు తెల్లకాగితాల్లో పరీక్షలు రాస్తే... వాటిని టీచర్లు ఇంటికెళ్లి మూల్యాంకనం చేసేవారు. ఈ క్రమంలో బడిలో పిల్లల బోధనకు ఆటంకం కలిగేది కాదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి సబ్జెక్టుకు ఒకటి చొప్పున... ఎన్ని సబ్జెక్టులంటే అన్ని మూల్యాంకన పుస్తకాలను పంపిణీ చేసింది. ఇప్పటి నుంచి ఈ పుస్తకాల్లోనే ఏడాది మొత్తం అన్ని పరీక్షలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,696 ఉండగా.. ఆయా పాఠశాలల్లో 1,42,327 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతమంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒకటి చొప్పున పుస్తకాలను ఇవ్వాలంటే రూ.కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదో పెద్ద స్కాం..అని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. వీటి వల్ల పిల్లలకు నష్టమే గానీ ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు.
ఇంటికి మోసుకెళ్లడం సాధ్యమా..?
గతంలో సమాధాన పత్రాలను ఆయా సబ్జెక్టు టీచర్లు ఇంటికి తీసుకెళ్లి మూల్యంకనం చేసి మార్కులు వేసి తిరిగి పాఠశాలకు తీసుకు వచ్చేవారు. కొందరు టీచర్లు వెసులుబాటును బట్టి బడిలోనే దిద్దేవారు. ఇప్పుడు మూల్యాంకన పుస్తకాలన్నింటినీ ఉపాధ్యాయులు ఇంటికి మోసుకెళ్లి వాటిని దిద్ది మళ్లీ పాఠశాలకు మోసుకురావడం సాధ్యమా..? అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. తరగతి గదిలోనే వాటిని దిద్దాలంటే బోధనకు సమయం ఎక్కడ సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.
కాపీ కొట్టేందుకు అవకాశం..
ఎఫ్‌ఏ–1, ఎఫ్‌ఏ–2 పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు కొన్ని క్వార్టర్టీ, హాఫ్ ఇయర్లీలో నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షల్లో కూడా పునరావృతమవుతాయి. అప్పుడు విద్యార్థులు ఈ మూల్యాంకన పుస్తకాల్లో గతంలో రాసిన సమాధానాలను చూసి కాపీ కొట్టేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా విద్యార్థులకు నష్టమే తప్ప లాభం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులపైనే కాకుండా టీచర్లపై కూడా ఇలాంటి నిర్ణయాలను బలవంతంగా రుద్దడం సరి కాదని ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి.
సంస్కరణల పేరిట మాల్యాంకన
పుస్తకాల పంపిణీ
బడిలోనే పేపర్లు దిద్దాల్సి రావడంతో బోధనపై ప్రభావం
కూటమి సర్కార్ అనాలోచిత
నిర్ణయంపై ఉపాధ్యాయుల ఆగ్రహం
బోధన సమయం వృథా
మూల్యాంకనం పుస్తకాలు బడిలోనే దిద్దాలంటే బోధన సమయం వృథా అవుతుంది. సంస్కరణలు విద్యార్థులకు మేలు చేయాలి గానీ ఇలా కీడు చేస్తే విద్యావ్యవస్థ నాశనమే.
– కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు,
ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్

టీచర్లకు మోత... నేతలకు మేత

టీచర్లకు మోత... నేతలకు మేత