
ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా
రామగిరి: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఎన్నిక కోసం అధికారులు బుధవారం ఏర్పాట్లు చేశారు. రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అయితే 10 మంది ఎంపీటీసీలకు గాను కేవలం ముగ్గురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. వారు కూడా పురుషులు కావడం...ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు అయిన నేపథ్యంలో ఎన్నికల అధికారి సంజీవయ్య రామగిరి ఎంపీపీ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు.
ఒక్కసీటుతో పీఠం కోసం టీడీపీ పాకులాట..
రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా అందులో పేరూరు–1, పేరూరు–2, మాదాపురం, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, రామగిరి, కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రిలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కాగా, రామగిరి ఎంపీటీసీ సభ్యురాలు మీనుగ నాగమ్మను ఆ పార్టీ అధిష్టానం ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టింది. అయితే గత డిసెంబరులో మీనుగ నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందగా... ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది.
నాలుగోసారి వాయిదా..
రాష్ట్ర ఎన్నికల సంఘం రామగిరి ఎంపీపీ ఎన్నికకు మార్చి 27న నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడింది. మే 18న రెండోసారి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వగా, మహిళా సభ్యులు హాజరుకాకపోవడంతో రెండోసారి వాయిదా పడింది. జూలై 16న మూడోసారి ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి నిరసనగా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికను బహిష్కరించడంతో మరోసారి వాయిదా పడింది. తాజాగా బుధవారం ఎన్నిక సజావుగా జరుగుతుందనే నమ్మకం లేనందున వైఎస్సార్ సీపీ సభ్యులు రాలేకపోయినట్లు సమాచారం. దీంతో నాల్గోసారి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
రామగిరి ఎంపీపీ ఎన్నికకు
ముగ్గురు ఎంపీటీసీలే హాజరు
టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల గైర్హాజరు
వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన అధికారి

ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా