
మద్యం.. జీవితాలు ఛిద్రం
సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీధివీధికీ బెల్టు షాపులు, పల్లెపల్లెకూ మద్యం దుకాణాలు వెలిశాయి. పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం దొరుకుతోంది. దీంతో పట్టుమని పాతికేళ్లు కూడా లేని యువత కూడా పట్టపగలే పూటుగా తాగి హల్‌చల్ చేస్తున్నారు. కొందరు మద్యం దుకాణాల పక్కనే కునుకు తీస్తున్నారు. మరికొందరు మత్తులో వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పైగా ఎదుటివారిపైనే గొడవకు దిగుతున్నారు. విషయం పోలీసుల వరకూ చేరుతుండగా..చివరకు జైలుపాలవుతున్నారు.
జనావాసాల్లోనే మద్యం దుకాణాలు
కదిరి, కొత్తచెరువు, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, మడకశిర ఇలా.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్యే మద్యం దుకాణాలు వెలిశాయి. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా పక్కనే రూములు, బండలు వేసి మందుబాబులకు వసతి కల్పిస్తున్నారు. ఫలితంగా జనావాసాల మధ్యనే ఉన్న మద్యం దుకాణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలో ఉన్న కూటమి పార్టీల నాయకులు ఒత్తిడి చేస్తుండటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.
కుటుంబ సభ్యులపైనే దాడి
మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరంలో 21 ఏళ్ల యువకుడు మద్యం తాగి ఇంటికి రావడంతో తల్లిదండ్రులు మందలించారు. మత్తులో ఆ యువకుడు కుటుంబసభ్యులపై దాడికి దిగాడు. దీంతో వారు బయటికి పరుగులు తీశారు. పగటి పూట కావడంతో ఇరుకుపొరుగు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మడకశిరలోనూ వెల్డింగ్ షాపులో పని చేసే 17 ఏళ్ల బాలుడు పూటుగా మద్యం సేవించి రాత్రి 11 గంటల సమయంలో ఇతరుల ఇంట్లో చొరబడ్డాడు. బీరు సీసాలతో రెచ్చిపోయాడు. ఇంట్లో ఉన్నోళ్లు భయపడి తలుపులు వేసుకున్నారు. ఉదయాన్నే పోలీసులను ఆశ్రయించారు. మందుబాబుకు పోలీసులు దేహశుద్ధి చేసి వదిలేశారు. ఇక మద్యం మత్తులో కొందరు యువకులు వర్గాలుగా ఏర్పడి దాడులకు దిగుతున్నారు. ఇది ఒక్కోసారి పెద్ద గొడవగా మారి ముష్టి యుద్ధాలను తలపిస్తున్నాయి.
విచ్చల విడిగా మద్యం విక్రయాలు
పట్టపగలే తాగి తూలుతున్న యువకులు
మత్తులో వాహనాలతో హల్‌చల్
అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనే దాడులు
రోడ్ల పక్కనే కునుకు
సమయపాలన లేకుండా.. ఎలాంటి షరతులు వర్తించకుండా.. ఎక్కడపడితే అక్కడ ఏ సమయంలో అయినా సరే మద్యం లభిస్తోంది. దీంతో మందుబాబులు తప్పతాగి ఇంటికి వెళ్లలేని స్థితిలో రోడ్ల పక్కనే కునుకు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు కొత్తచెరువు, కదిరి, పుట్టపర్తిలో వెలుగు చూశాయి. మందుబాబులు పట్టపగలే రోడ్లపై కునుకు తీస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోనూ మద్యం దుకాణాల పక్కనే వసతి కల్పించడంతో మందుబాబులు అక్కడే తాగి చుట్టుపక్కల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

మద్యం.. జీవితాలు ఛిద్రం

మద్యం.. జీవితాలు ఛిద్రం

మద్యం.. జీవితాలు ఛిద్రం