
బాబు మోసాలను ఊరూరా వివరిద్దాం
గోరంట్ల: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత అన్ని వర్గాలను మోసం చేసిన తీరును ఊరూరా వివరిద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. కూటమి పార్టీల నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ప్రతి ఇంటికి వెళ్లి వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని బూదిలి, మల్లాపల్లి, గౌనివారిపల్లి, మలసముద్రం, కొండాపురం, గోరంట్లలో ‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ నెరవేర్చలేదన్నారు. పైగా హామీలన్నీ అమలు చేశామంటూ గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏడాది మూడు సిలిండర్లు ఇస్తామన్న కూటమి నేతలు...ఒక్క సిలిండర్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. ‘తల్లికి వందనం’ అమలులోనూ నిబంధనల పేరుతో అర్హులకు పథకం అందకుండా చేశారన్నారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చినా... 14 నెలలల తర్వాత అరకొరగా అందించి చేతులు దులుపుకున్నారన్నారు. ఇక నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే బీసీలకు పింఛన్, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీలేవీ అమలు చేయకుండా అందరినీ మోసం చేశారన్నారు. కానీ 14 నెలల పాలనలో రూ.140 వేల కోట్లు అప్పు చేసి కూటమి నేతలు జేబులు నింపుకున్నారని ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. ‘హామీల అమలు ఎప్పుడు బాబూ’ అని ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తూ గొంతునొక్కుతున్నారన్నారు.
పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. అధికారం అండతో అరాచకాలకు పాల్పడ్డారన్నారు. కూటమి నేతలు బరితెగించి స్థానికేతరులతో ఓట్లు వేయిస్తున్నా... వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేస్తున్నా పోలీసులు కూడా చూస్తూ ఊరుకోవడం దుర్మార్గమన్నారు. గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఇలాగే వ్యవహరించిందని, ఆ తర్వాత కొన్ని నెలలకే అబాసుపాలైన సంగతి ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెంకటేశు, పట్టణ కన్వీనర్ మేదర శంకర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు గంపల వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా ట్రెజరర్ బాలన్నగారిపల్లి రామకృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ముఖ్యనాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్ పిలుపు