
నేడు రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక
సాక్షి, పుట్టపర్తి: ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక బుధవారం రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పారని పాచిక
ఎంపీపీ పదవికి పోటీ చేసేందుకు అభ్యర్థి లేకున్నా.. సొంత మండలంలో పీఠం దక్కించుకోవాలని పరిటాల సునీత పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే మూడుసార్లు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినా.. పరిటాల సునీత పాచిక పారలేదు. దీంతో ఎంపీపీ పీఠం కోసం మరోసారి ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. బుధవారం నాల్గోసారి రామగిరి ఎంపీపీ పదవి కోసం ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. టీడీపీ నేతలు చేస్తోన్న అరాచకాలతో ఈసారి కూడా ఎంపీపీ ఎన్నికకు సభ్యులు హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ఫలితంగా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది.
బలం లేకున్నా.. పీఠంపై గురి
రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 9 చోట్ల వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగుర వేసింది. టీడీపీ ఒక స్థానంలో సరిపెట్టుకుంది. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో రామగిరి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచిన మీనుగ నాగమ్మను వైఎస్సార్ సీపీ ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టింది. అయితే ఆమె హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ బలం ఆరుగా ఉంది. టీడీపీ సభ్యుడి జతకు పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు చేరారు. ఫలితంగా టీడీపీ సంఖ్య మూడుకు చేరింది. ఇంకో స్థానం ఖాళీగా ఉంది. పార్టీ ఫిరాయించిన వారిలోనూ ఒకరు జనసేనలోకి వెళ్లారు. అయితే టీడీపీకి మద్దతుగా ఉన్న వారిలో ఒక్కరు కూడా మహిళ లేకపోవడంతో పోటీ చేసేందుకు అభ్యర్థి లేక.. పరిటాల సునీత దిక్కులు చూస్తున్నారు. అయితే బలవంతంగా ఎవరో ఒకరికి కండువా వేసి ఎంపీపీ పదవి కట్టబెట్టి జెండా ఎగరవేయాలని ప్లాన్‌లో ఉన్నట్లు తెలిసింది.
రచ్చ చేసి.. వాయిదా వేసి..
ఎంపీపీ ఎన్నిక ఇప్పటి వరకు మూడుసార్లు వాయిదా పడింది. దీంతో నాల్గోసారి నోటిఫికేషన్ వదిలారు. ప్రతిసారీ టీడీపీ నేతలు రచ్చ చేస్తుండటంతో వాయిదా పడుతూ వస్తోంది. సామరస్యంగా.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికను రచ్చ చేసి.. తమ వైపు తిప్పుకోవాలని చూస్తుండటంతో వాయిదా పడుతూ వస్తోంది.