
బిడ్డ మృతిని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం
మైసూరు : కుమార్తె మృతిని జీర్ణించుకోలేని తల్లి ఆత్మహత్యకు యత్నించింది. ఈఘటన మైసూరు జిల్లా హెచ్‌డీ కోటె తాలూకా కొళ్లెగౌడనహళ్లిలో జరిగింది. చైత్ర, రసిక దంపతుల కుమార్తె శ్వేత(3) ఇంటి వెనుక ఆడుకుంటూ కాలుజారి పడటంతో తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే రక్తం ఎక్కువగా కారడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో తీవ్ర ఆవేదనకు లోనైన తల్లి చైత్ర పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. హెచ్‌డీకోటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు
● పోలీసు అధికారికి మహిళ ఫిర్యాదు
యశవంతపుర: ప్రాణం తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు అత్యాచారానికి గురై శిశువుకు జన్న ఇచ్చిన బాధిత మహిళ దక్షిణకన్నడ జిల్లా మంగళూరు పశ్చిమ విభాగం డీఐజీ అమిత్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బాధిత మహిళ తన శిశువును తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేశారు. పుత్తూరుకు చెందిన బీజేపీ నాయకుడు జగన్నీవాసరావ్ కుమారుడు శ్రీకృష్ణరావ్, తనది ఒకే ఊరని, ఇద్దరం కలిసి 9వ తరగతి నుంచి ప్రేమించుకున్నట్లు పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి శారీరకంగా కలవడంతో శిశువుకు జన్మ ఇచ్చినట్లు పేర్కొంది. తన ఫిర్యాదుతో అతను జైలుకు వెళ్లాడని, ప్రస్తుతం అతని కుటుంబం తనను హత్య చేస్తామంటూ బెదిరిస్తోందని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది.
శ్మశాన స్థలం కబ్జా
యశవంతపుర: వాణిజ్య కట్టడాలు, ఇళ్లు, భూములను కబ్జాలను చేయటం చూశాం. కానీ దక్షిణకన్నడ జిల్లా బంట్వాళ తాలూకా అమ్మాడి గ్రామంలో కొందరూ శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారు. అమ్మాడి దేవినగరలోని హిందూ రుద్రభూమిని కబ్జా చేయగా శ్మశాన వాటికలోని రూ. 4 లక్ష విలువ గల అనేక వస్తువులు చోరీకి గురైనట్లు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మావటీలకు రాఖీ కట్టిన మహిళలు
మైసూరు : మైసురు దసరా ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన జంబూ సవారీలో పాల్గొనే గజరాజులను తీసుకొని వచ్చిన మావటిలకు, కాపలదారులకు శ్రీదుర్గా ఫౌండేషన్‌కు చెందిన మహిళలు రాఖీలు కట్టి రక్షాబంధన్‌ను ఘనంగా నిర్వహించారు. ప్యాలెస్ మైదానంలో ఉన్న మావటిలకు, కాపలదారుకు రాఖీలు కట్టి హారతి ఇవ్వడంతొపాటు స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం డీసీఎఫ్ ప్రభుకు సైతం మహిళలు రాఖీ కట్టారు. ఫౌండేషన అధ్యక్షురాలు రేఖా శ్రీనివాస్, రుషివిను, కావ్య, రాఘవేంద్ర, రాజేష్‌లు పాల్గొన్నారు.