
ఏనుగు దాడిలో రైతు మృతి
కెలమంగలం: పేడను చెత్తకుప్పలో పడవేసేందుకు వెళ్లిన రైతుపై ఏనుగు దాడి చేసి చంపిన ఘటన మంగళవారం తళి సమీపంలో చోటు చేసుకొంది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని చూడసంద్రం గ్రామానికి చెందిన రైతు కుళ్లప్ప(60) ఉదయం పశువుల పేడను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేవేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో క్షత్రందొడ్డి అటవీ ప్రాంతం నుంచి బయటకొచ్చిన ఓ ఏనుగు రైతుపై దాడి చేసింది. ఈ ఘటనలో కుళ్లప్ప ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా డెంకణీకోట, తళి, అంచెట్టి, సూళగిరి ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఏనుగుల దాడుల్లో పంటలు ధ్వంసం, రైతులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నా అటవీ శాఖాధికార్లు చర్యలు చేపట్టలేదంటూ రైతు రక్షణ సంఘం ద్వారా ఆందోళన నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు గణేష్‌రెడ్డి తెలిపారు.