ఇరు కుటుంబాల ఘర్షణ
తాడిపత్రి టౌన్/పెద్దపప్పూరు: నియోజకవర్గంలో టీడీపీ నాయకుల నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువులో ఇరు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందారు. వివరాలు.. తిమ్మనచెరువు గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు ఆదివారం గ్రామ దేవతలకు మొక్కు చెల్లించి విందు ఏర్పాటు చేసాడు. కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన ఓబులేసు కుటుంబసభ్యులూ హాజరయ్యారు. కాగా, ఓబులేసుకు కుమార్తె రత్నమ్మ, కుమారులు రాజు, నాగేంద్ర, ఓబులేసు ఉన్నారు. రత్నమ్మకు 15 సంవత్సరాల క్రితమే వివాహమైంది. కుమార్తె కుటుంబానికి తండ్రికి మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విందు కార్యక్రమంలో ఇరు కుటుంబాలు తారసపడి ఘర్షణకు దిగాయి. రత్నమ్మపై తండ్రి ఓబులేసు, తమ్ముడు రాజు చేయి చేసుకున్నారు. దీంతో రత్నమ్మ భర్త చిన్నరంగయ్య, అమె బావ పెద్దరంగయ్య, కొడుకు మనోజ్ వెంటనే ఓబులేసు, రాజుపై కర్రలతో, పైపులతో దాడి చేశారు. తండ్రిని, అన్నను కొడుతున్నారన్న విషయం తెలుసుకున్న నాగేంద్ర, ఓబులేసు వెంటనే అక్కడకు చేరుకుని చిన్న రంగయ్య, పెద్ద రంగయ్య, మనోజ్‌పై కొడవలి, కర్రలతో ప్రతి దాడికి దిగారు. ఘటనలో వీరితో పాటు బంధువులు కిట్ట, వేణుకూ గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబసభ్యులు తొలుత తాడిపత్రిలోని ఆస్పత్రికి, అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓబులేసు కుమారుడు రాజు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వేమనాథరెడ్డి కారు డ్రైవర్ కావడంతో టీడీపీ నాయకులు వెంటనే రాజకీయ రంగు పులిమి ఆ పార్టీ నేతలపై దాడులు చేశారంటూ వివాదానికి తెరలేపారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిళ్లు తీసుకెళ్లారు. కాగా, ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజకీయ రంగు పులిమిన పచ్చ నేతలు
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై
కేసు బనాయించేలా కుట్ర


