పేదలకు సేవ చేస్తే దేవునిగా కీర్తిస్తారు
బత్తలపల్లి: పేదల కోసం ఎవరైతే పాటుపడతారో వారిని గుండెల్లో పెట్టుకుని దేవునిలా కీర్తిస్తారని ఆర్డీటీ మహిళా సాధికారిత డైరెక్టర్ విశా ఫెర్రర్ అన్నారు. శనివారం మాల్యవంతం ఎస్సీ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కాంస్య విగ్రహాన్ని విశా ఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరువు పీడిత ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అడుగుపెట్టినపుడు వెనక్కు వెళ్లిపోవాలని కొందరు అడ్డుపడ్డారన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు, వివిధ రంగాల్లో ప్రోత్సహించిన తీరును చూసి దేవుడని కొనియాడుతున్నారని గుర్తు చేశారు. మనం ఒకరికి సాయం చేయాలన్న ఆశయంతో ముందుకు వెళ్లారని, ఆయన బాటలోనే పలువురు ఈరోజు ముందుకు వస్తున్నారని తెలిపారు. మాల్యవంతంలో పలువురు ఆర్డీటీ సహకారంతో అభివృద్ధి సాధించారని వివరించారు. అలాంటి వారందరూ కలిసిమెలిసి ఉండి ఆర్డీటీ, ప్రభుత్వం అందించే పోత్రాహకాలను పొందుతూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంతకు ముందు విశా ఫెర్రర్‌కు ఎస్సీ కాలనీ వాసులు ఘనస్వాగతం పలికారు. ఆర్డీటీ సహకారంతో ఉన్నత చదువులు చదివి బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తమ పిల్లల తరఫున తల్లిదండ్రులు ఓబుళమ్మ, కుళ్లాయప్ప ‘స్పందించు– సాయం అందించు’ కార్యక్రమానికి రూ.50 వేలను విశా ఫెర్రర్‌కు అందించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ ప్రమీల, ఏటీఎల్ క్రిష్ణ, ఎస్టీఎల్ వెంకటేష్, కావేరి, మధు, సీఓ నాగరాజు, సీబీటీ వీరనారప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


