బి.యాలేరులో రెచ్చిపోయిన రౌడీషీటర్లు
● వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడిన బండి పరుశురాం తదితరులు
● రౌడీషీటర్లకు పరిటాల కుటుంబం అండ
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికారం మదంతో రౌడీషీటర్లు బండి పరుశురాం, ఈడిగ ఈశ్వరయ్య శనివారం ఆత్మకూరు మండలం బి.యాలేరులో రెచ్చిపోయారు. వివరాలు.. శనివారం వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి బి.యాలేరులో గ్రామస్తులతో మాట్లాడుతుండగా భూసమస్య విషయంలో బండి పరశురాం వాదనకు దిగాడు. అయితే అన్నదమ్ముల సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ తోపుదుర్తి చందు సర్దిచెప్పేందుకు యత్నించినా రెచ్చిపోయాడు. టీడీపీ నాయకులకు అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేశారు. ఈక్రమంలో వారు తిరగబడడంతో రౌడీషీటర్లు తోకముడిచారు.
రోజురోజుకూ పెరుగుతున్న దౌర్జన్యాలు
టీడీపీ అధికారంలోకి రాగానే బి. యాలేరులో వైఎస్సార్ విగ్రహం చేయిపై దాడి చేశారు. వైఎస్ జగన్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్లున్నాయన్న అక్కసుతో ఆర్బీకే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళకు జుట్టు కత్తిరించారు. బండి బాలకొండమ్మ, బండి చిన్న అహోబిలంపై నడి బజార్లో రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. జగనన్న కాలనీల్లో రౌడీషీటర్ల టీడీపీ నేతలు పేరు చెప్పుకుని రూ.10 వేలు తీసుకొని ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. పరిటాల కుటుంబం అండతోనే రౌడీషీటర్లు బండి పరుశురం, ఈడిగ ఈశ్వరయ్య దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.
ఆస్తి కాజేయాలనే కక్షగట్టాడు :
బండి నాగరాజు
రౌడీ షీటర్ బండి పరశురాం, వాళ్ల నాన్న బండి ముసలన్న మా పొలాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మా తాత ఓబులేసుకు ఐదుగురు సంతానం. రెండు సర్వే నంబర్లలోని భూమిని వారుసులైన బండి మలరాయుడు, బండి ముసలన్న, బండి పెద్ద అహోబిలం, బండి చిన్న అహోబిలం, బండి శంకరయ్య సమానంగా పంచుకున్నారు. మానాన్న బండి చిన్న అహోబిలం వాటాగా వచ్చిన 3.23 ఎకరాల భూమిని బండి ముసలన్న, ఆయన కొడుకు బండి పరశురాం ఆక్రమించాలని చూస్తున్నారు. నాకు వంశపారంపర్యంగా వచ్చిన భూమినే ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నా. ఆ భూమిపై నిజంగా నాకు హక్కు లేకుంటే.. దౌర్జన్యంగా గత ప్రభుత్వంలో ఆన్‌లైన్‌లో ఎక్కించుకుని ఉంటే.. మరి ఎమ్మెల్యే పరిటాల సునీత రెండేళ్లుగా ఎందుకు రద్దుపరచలేకపోయారు. చట్టబద్ధంగా ఉన్న ఆ భూమి విషయంలో ఏమీ చేయలేమనే విషయం వారికి తెలుసు. కావాలనే పరిటాల కుటుంబం బండి పరుశురాం ద్వారా తోపుదుర్తి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయిస్తోంది. పరుశురాం అన్న పిల్లలను ఎన్టీఆర్ స్కూల్‌లో చదివిస్తున్నాం కనుక.. తాము చెప్పినట్టుగా తోపుదుర్తి కుటుంబంపై అసత్యపు ఆరోపణలు చేయాలంటూ ఉసిగొలుపుతున్నారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి చేస్తున్న టీడీపీ నేతలు, చందు వాహనం వద్ద పరశురాం హల్‌చల్
ప్రజలకు భూములిచ్చాం :
తోపుదుర్తి చందు
నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇంటి స్థలాలు లేని ప్రజలకు సొంత డబ్బుతో భూములు కొని పట్టాలిప్పించాం. భూములు లాక్కునే దుస్థితిలో మా కుటుంబం లేదు. కావాలనే ఎమ్మెల్యే సునీత, ధర్మవరం బాలాజీ బండి పరశురాం అనే వ్యక్తిని రెచ్చగొట్టి సమావేశాల్లో గొడవలు సృష్టించేలా మాట్లాడిస్తూ కక్షలు రేపుతున్నారు. వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న జనాధరణ, ప్రకాష్‌రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న జన బలం చూసి ఎమ్మెల్యే సునీత ఇలాంటి వారిచే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు.
బి.యాలేరులో రెచ్చిపోయిన రౌడీషీటర్లు


