నేడు ఎస్టీఏ జిల్లాస్థాయి సమావేశం
పెనుకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీఎస్టీఏ(ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్) జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారుతి, జయకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు, కోశాధికారి పుల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి కార్యదర్శులు రాజేష్, నాగరాజు తదితరులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. సమావేశానికి సంఘం జిల్లా, మండల నాయకులు హాజరుకావాలని కోరారు.
డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జ్ పదవీకాలం పొడిగింపు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్‌చార్జ్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్ ఇన్‌చార్జ్‌గా ఉన్న నెట్టెం వెంకటేశులు పదవీకాలం శనివారంతో ముగిసింది. ఇపుడు మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తరులు ఇచ్చారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్‌చార్జ్ పదవీ కాలాన్ని కూడా ఆరు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
రోడ్డు ప్రమాదంలో
దంపతులకు తీవ్రగాయాలు
● 45 నిమిషాలైనా రాని 108 వాహనం
శింగనమల: శివపురం వద్ద ఎన్‌హెచ్544–డీపై జరిగిన ప్రమాదంలో తాడిపత్రికి చెందిన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, లక్ష్మీదేవి బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లికి వెళ్లి, తిరిగి తాడిపత్రికి బైక్‌పై బయలుదేరారు. శివపురం వద్దకు రాగానే బైక్ డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 కోసం ఫోన్ చేసి 45 నిమిషాలు వేచి చూసినా రాకపోవడంతో రోడ్డు పనులు చేస్తున్న అంబులెన్స్‌లో అస్పత్రికి తరలించారు.
హోరాహోరీగా
ఉమెన్స్ క్రికెట్ పోటీలు
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్పోర్ట్స్ మైదానంలో జరుగుతున్న ఏఎస్‌ఏ ఉమెన్స్ కప్ పోటీలు హోరాహోరీగా సాగాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లలో బీజెడ్‌ఏ, ఏఎస్‌ఏ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై గెలుపొందాయి. పోటీలను జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి పర్యవేక్షించారు.


