అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● 40 తులాల బంగారు, 7 కేజీల వెండి రూ.లక్ష నగదు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఎస్పీ జగదీష్
అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అనంతపురం సీసీఎస్, త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 70 లక్షల విలువైన 40 తులాల బంగారు నగలు, రూ.లక్ష నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన యాదవల్లి మంజు, పిచ్చుగుంట్ల రామదాసు బళ్లారితో పాటు గుంటూరు, అనంతపురం జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు, బ్యాగ్‌ల దొంగతనాలు, తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, కసాపురం, డి.హీరేహాళ్, బుక్కరాయసముద్రం తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెలుతున్న మహిళల మెడల్లోని బంగారు చైన్‌లను లాక్కెళ్లారు. బస్సుల్లో ప్రయాణికుల మాదిరిగా జతకలిసి ఆదమరిచి ఉన్న సమయంలో బ్యాగ్‌లు చోరీ చేశారు. ఇటీవల దొంగలపై నిఘా పెట్టడడంతో బళ్లారిరోడ్డులో నిందితులు ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. మోస్ట్ వాంటెడ్ నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐలు శేషగిరి, జయపాల్‌రెడ్డి, రామయ్య, ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి, త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌తోపాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


