అరణ్యం నుంచి జనారణ్యంలోకి..
పెనుకొండ రూరల్: అరణ్యంలో ఉండాల్సిన చిరుతలు జనారణ్యంలోకి చొరబడుతున్నాయి. ఈక్రమంలో కనిపించిన పశువులుకు మేకలపై దాడులు చేస్తుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు. పెనుకొండ డివిజన్ వ్యాప్తంగా రిజర్వుడు ఫారెస్టు 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. నిప్పు పెట్టడంతో అడవులు మొత్తం మైదాన ప్రాంతంలా మారిపోతున్నాయి. దీంతో చిరుతలకు అక్కడ రక్షణతోపాటు సరైన ఆహారం దొరకడం లేదు. ఈనేపథ్యంలో అటవీ ప్రాంతాన్ని వదిలి జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. కనిపించిన పశువులు, జీవాలను దాడి చేసి చంపేస్తున్నాయి.
అధికమైన దాడులు..
పెనుకొండ అటవీ ప్రాంతంలో చిరుతలు దాడులు అధికమయ్యాయి. ఇటీవల పట్టణంలోని జీఐసీ కాలనీలో ఆరుబయట ఉన్న మూడు గొర్రెలపై చిరుత దాడి చేసి చంపేసింది. సోమందేపల్లి మండలం మరువకుంటపల్లి సమీపంలోని పొలాల్లో చిరుత సంచారం వీడియో వైరల్‌గా మారింది. దీంతో గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లడమే మానేశారు. ఇక ఏటా పదుల సంఖ్యలో చిరుతలు పశువులు, జీవాలపై దాడులు చేస్తున్నాయి. 2024– 2025లో డివిజన్ వ్యాప్తంగా 12 దాడులు జరిగినట్లు అటవీ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 2025–2026లో 11 ఘటనలు జరిగాయి. అయితే ఈ ఏడాది ఘటనల్లో మృతి చెందిన పశువులు, జీవాల యజమానులకు ఎలాంటి పరిహారం అందలేదు.
కనిపించని
హెచ్చరిక బోర్డులు..
క్రూర జంతువులు సంచరించే ప్రదేశాలు, వన్యప్రాణులు రోడ్డు దాటే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులును అధికారులు ఏర్పాటు చెయ్యాల్సి ఉంది. అయితే పెనుకొండ ఫారెస్టు రేంజ్‌లో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన దాఖాలాలు లేవు. దీన్ని బట్టి చూస్తే అటవీ ప్రాంతంపై సంబంధిత అధికారుల నిఘా కొరవడినట్లు స్పష్టమవుతోంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో అధికారులు వ్యనప్రాణులు, అటవీ సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అటవీ అధికారులు చిరుతల నుంచి పశువులు, జీవాలకు రక్షణ కల్పించాలని పశువులకాపర్లు కోరుతున్నారు.
పెరిగిన చిరుతల సంచారం
పశువులు, మేకలపై దాడులు
భయాందోళనలో ప్రజలు
అవగాహన కార్యక్రమాలు చేపడతాం
ప్రమాదకర అటవీ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. అటవీ ప్రాంతాలు అగ్నికి ఆహుతి కాకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. చిరుత దాడుల్లో మృతి చెందిన పశువులు, జీవాల యజమానులకు పరిహారం అందేలా చూస్తాం.
–శ్రీనివాస్ రెడ్డి, ఫారెస్టు రేంజ్ అధికారి.
అరణ్యం నుంచి జనారణ్యంలోకి..


