ప్రవర్తనలో మార్పు రావాలి
హిందూపురం: క్షణికావేశంలో చేసిన తప్పులతో జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీల ప్రవర్తనలో మార్పు రావాలని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ సూచించారు. శనివారం హిందూపురం సబ్‌జైలును ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. ఎప్పటి నుంచి సబ్‌జైలులో ఉంటున్నారు, న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారా, ఎలాంటి కేసులు నమోదయ్యాయి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. సబ్‌జైలులో సౌకర్యాలు, భోజనం తదితర సదుపాయాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏడీజే మాట్లాడుతూ తప్పులు చేసి జైలుకు రావడం వల్ల కుటుంబ గౌరవ మర్యాదలు దెబ్బ తినడంతో పాటు ఆర్థికంగానూ ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. పలువురు ఖైదీలు మాట్లాడుతూ బెయిల్ మంజూరైనా జామీనుదారులను ఏర్పాటు చేసుకోలేకపోవడం వల్ల బయటకు వెళ్లలేకపోతున్నామని ఏడీజేకు వివరించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆమె తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులుంటే ఖైదీలు దరఖాస్తు చేసుకోవాలని, అలాంటి వారికి ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని చెప్పారు. అయితే చేసిన తప్పులనే మళ్లీ చేసి జైలుకు వస్తే అనేక ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాది నవేరా, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, లైజనింగ్ అధికారి శ్రీనివాసులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
సబ్‌జైలును తనిఖీ చేసిన
అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ


