పురంలో ఆగనున్న ‘వందేభారత్’
హిందూపురం/సోమందేపల్లి: కాచిగూడ–యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హిందూపురం రైల్వే స్టేషన్‌లో అడిషనల్ స్టాపింగ్‌ను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ శనివారం ప్రారంభించారు. అలాగే రూ.7 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన సోమందేపల్లి మండలంలోని చాకర్లపల్లి రైల్వేస్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు హిందూపురం రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 12.35 గంటలకు రాగా.. కేంద్ర మంత్రి సోమణ్ణ జెండా ఊపి యశ్వంత్‌పూర్‌కు పంపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ వందేభారత్ ఆగడం వల్ల హిందూపురం ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. చాకర్లపల్లి రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు..
దక్షిణ భారత దేశంలో రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి, రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి సోమణ్ణ తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు రూ.886 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.9,470 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,560 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాల నిర్మాణం, 717 ఆర్‌ఓబీలు, ఆర్‌యుబీల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ‘అమృత్ భారత్’ కింద 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాల ప్రధాన రైల్వేస్టేషన్లతో పాటు హిందూపురం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ బీకే పార్ధసారధి, ఏడీఆర్‌ఎం ప్రవీణ్ కటారకి, చీఫ్ ఇంజినీర్ ప్రేమ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
వందేభారత్ స్టాపింగ్ వివరాలు..
వందేభారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (నెంబర్ 20703) కాచిగూడ నుంచి హిందూపురానికి మధ్యాహ్నం 12.08 గంటలకు వచ్చి.. 12.10కి బయలుదేరుతుంది. తిరిగి రైలు నంబరు 20704గా యశ్వంత్‌పూర్ నుంచి హిందూపురానికి మధ్యాహ్నం 3.48 గంటలకు వచ్చి 3.50 గంటలకు కాచిగూడకు వెళుతుంది.
పెనుకొండలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపండి..
పెనుకొండ రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడానికి చర్యలు తీసుకోవాలని స్ధానిక నాయకులు కేంద్ర మంత్రి సోమణ్ణకు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో తగిన సౌకర్యాలు లేవని, వెంటనే మెరుగుపరచాలని సీసీఐ నాయకులు జగదీష్, వేమయ్య యాదవ్ వినతి పత్రం అందజేశారు.
రైలు స్టాపింగ్ ప్రారంభించిన
కేంద్ర మంత్రి సోమణ్ణ
చాకర్లపల్లి రైల్వేస్టేషన్ జాతికి అంకితం


