అన్న మరణంతో.. ఆగిన సోదరి గుండె
ఓడీచెరువు (అమడగూరు): చిన్నప్పటి నుంచి తనను ఎంతో అన్యోన్యంగా చూసుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఏ కష్టమొచ్చినా అండగా ఉండేవాడు. అలాంటి సోదరుడు మరణించాడన్న వార్త విన్న చెల్లెలు తట్టుకోలేకపోయింది. కుమిలికుమిలి ఏడ్చింది. ఆ వేదనతోనే సోదరుడికి తోడుగా తనూ ప్రాణాలు విడిచింది. అన్న మరణ వార్త తట్టుకోలేని సోదరి హఠాన్మరణం చెందిన ఘటన అమడగూరు మండలం కొట్టువారిపల్లి పంచాయతీలో విషాదం నింపింది. వివరాలు.. అమడగూరు మండలంలోని కొట్టువారిపల్లి పంచాయతీ జవకల గ్రామానికి చెందిన డేరంగుల నారాయణ స్వామి (42)కి భార్య, 13 ఏళ్ల కుమారుడు ఉన్నారు. నారాయణ స్వామి కొన్ని రోజులుగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతుండేవాడు. రెండు రోజుల క్రితం కూడా కడుపు నొప్పి రావడంతో కుటుంబీకులు తిరుపతిలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే, చికిత్స ఫలించక శుక్రవారం రాత్రి నారాయణ స్వామి కన్నుమూశాడు.
అన్న మరణాన్ని జీర్ణించుకోలేక..
నారాయణ స్వామికి ఒక సోదరి రేపన అంజనమ్మ (40) ఉంది. ఈమె భర్త గతేడాది మరణించడంతో ఆ కుటుంబ ఆలనాపాలనా కూడా నారాయణస్వామి చూసేవాడు. అలాంటి అన్న మరణించాడన్న విషయం తెలియగానే అంజనమ్మ శోకసంద్రంలో మునిగిపోయింది. గుండెలవిసేలా రోదించిన ఆమె దుఃఖంలో రాత్రి 11 గంటల సమయంలో హఠాత్తుగా కన్నుమూసింది. ఒకేసారి అన్నాచెల్లెలి మృతితో జవకల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపన అంజనమ్మకు ఏడేళ్ల కుమార్తె జనని ఉంది. గతంలో తండ్రి, తాజాగా తల్లి మృతిలో చిన్నారి అనాథగా మారింది. మృతడు డేరంగుల నారాయణ స్వామి భార్య కూడా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వీరి దీన స్థితి తెలుసుకున్న వడ్డే ఓబన్న ఆశయ సాధన సమితి సభ్యులు అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.
కొట్టువారిపల్లిలో విషాదం
అన్న మరణంతో.. ఆగిన సోదరి గుండె


