టీడీపీ కార్యకర్తలతో వెంకటరాముడు (ఫైల్)
ఎస్టీ మహిళతో టీడీపీ నేత అసభ్య ప్రవర్తన
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అకృత్యాలు పెచ్చుమీరాయి. ఈ క్రమంలోనే ఆ పారీ్టకి చెందిన వెంకటరాముడు వ్యవసాయ కూలీలకు మేస్త్రీగా వ్యవహరిస్తున్న ఎస్టీ మహిళను కులం పేరుతో దూషించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసుల కథనం ప్రకారం.. బత్తలపల్లి మండలం సంగాల గ్రామానికి చెందిన దేవరకొండ గాయత్రి వ్యవసాయ పనులకు వెళుతుంటుంది. భర్త ధర్మవరం వెళ్లి దర్జీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
గాయత్రి వ్యవసాయ కూలీలకు మేస్త్రీగా వ్యవహరిస్తుండటంతో సమీప గ్రామాల రైతులు కూలీలు కావాలంటే ఆమెకు ఫోన్‌చేసి పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే మూడు వారాల క్రితం బత్తలపల్లి మండలం వరదాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత నాగోతి వెంకటరాముడు ఫోన్‌చేసి పంట పొలంలో కలుపు తీయడానికి 20 మంది కూలీలను తీసుకుని రావాలని చెప్పాడు. దీంతో ఆమె 20 మంది కూలీలతో వేరుశనగ పంటలో కలుపు తీయడానికి వరదాపురం వెళ్లింది. అదే సమయంలో వెంకటరాముడు గాయత్రికి ఫోన్ చేసి.. ‘నువ్వంటే ఇష్టం.. నువ్వు నాకు కావాలి.
మాట్లాడుకుందాం.. పక్కకు రా’ అని పిలిచాడు. ఆమె వెళ్లకపోవడంతో అదేరోజు సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి ‘నేను పిలిచినా రావా. నీ అంతు చూస్తా.. ఒంటరిగా దొరకవా’ అని బెదిరించాడు. దీంతో భార్యాభర్త కలసి వెంకటరాముడును మందలించారు. దీనిని మనసులో పెట్టుకున్న వెంకటరాముడు బాధితురాలికి జ్వాలాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ కరపత్రాలు రాయించి సంగాల నుంచి జ్వాలాపురం వరకు వీధుల్లో విసిరాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకటరాముడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు.


