శిల్పకళా నిలయం.. హేమావతి క్షేత్రం
హేమావతి (అమరాపురం): మండలంలోని హేమావతిలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా సాగుతుంటాయి. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆదివారం అఖండ పూజలు, విశేష అభిషేకాలు, భజనలు, కీర్తనలు ఉంటాయి. 16న భానుపల్లకి, ధూళోత్సవం, అన్నసంతర్పణ, 17న అగ్నిగుండం ప్రవేశం, ముత్యాలపల్లకీ ఉత్సవం, వివిధ రకాల పుష్పాలంకరణ ఉంటుంది. 18న సాయంత్రం సిడిమాను ఉత్సవం, అన్నసంతర్పణ, రాత్రికి ముత్యాలపల్లకీ ఉత్సవం, 19న చిన్న రథోత్సవం, రాత్రి ముత్యాల పల్లకీ ఉత్సవం, 20న బ్రహ్మరథోత్సవం, అన్నసంతర్పణ, 21న వసంతోత్సవం, 22న శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది.
ఆలయ విశిష్టత..
అరుదైన శిల్ప కళానిలయంగా ఉన్న హేమావతి సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని క్రీ.శ.720లో నోళంబ రాజులు నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం పల్లవులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసినట్లుగ చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. హేమావతి గ్రామం నడిబొడ్డున సువిశాలమైన 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయంలో సిద్దేశ్వరస్వామి, దొడ్డేశ్వరస్వామి, మల్లేశ్వరస్వామి కొలువై భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ శివుడు లింగరూపంలో కాకుండా మానవాకారంలో దర్శనమిస్తుండడం విశేషం. ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తుతో మూలవిరాట్ అబ్బుర పరుస్తోంది. శ్రావణ, కార్తీక మాసాల్లో సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్‌ను తాకుతుంటాయి. దొడ్డేశ్వర ఆలయం ప్రాంగణం ఒక్కప్పుడు ఘటిక స్థానం (విద్యా కేంద్రం)గా ఉండేదని అక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
సుమారు పదిహేను ఎకరాల స్థలం.. ప్రశాంత వాతావరణం.. చూడచక్కని శిల్ప కళావైభవంతో దేశంలోనే అరుదైన శైవ క్షేత్రాల్లో ఒక్కటిగా విరాజిల్లుతోంది హేమావతిలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం. ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 15న మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లను దేవదాయ శాఖ ఈఓ నరసింహరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ్ పూర్తి చేశారు.
మానవాకారంలో దర్శనమిస్తున్న హెంజేరు సిద్ధేశ్వరస్వామి
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
ఏర్పాట్లు పూర్తి
హేమావతి గ్రామంలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశాం. దాతల సహకారంతో నిత్య అన్నదానం ఉంటుంది.
– నరసింహరాజు ఈఓ
శిల్పకళా నిలయం.. హేమావతి క్షేత్రం
శిల్పకళా నిలయం.. హేమావతి క్షేత్రం


