పుట్టపర్తి అర్బన్: జిల్లా రెవెన్యూ భవన్ బుధవారం ప్రారంభమైంది. పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లో ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన రెవెన్యూ భవన్, ఎస్‌ఆర్ శంకరన్ హాలును బుధవారం మంత్రులు సత్యప్రసాద్, సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర తదితరులు ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు భవనం ఆవరణలో మొక్కలు నాటారు.
తహసీల్దార్ శ్రీధర్ నివాసంలో ఏసీబీ సోదాలు
● భారీగా నగదు, బంగారు,
పత్రాలు స్వాధీనం
అనంతపురం సెంట్రల్: మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గుడిబండ మండల తహసీల్దార్ శ్రీధర్ నివాసంలోనూ బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలోని ఆయన నివాసంలో సోదాలు చేశారు. భారీగా అక్రమ ఆస్తులు కూడిబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే తనిఖీలకు సంబంధించి ఏసీబీ అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు రూ. 55 లక్షల నగదు, 22 తులాలు బంగారు ఆభరణాలు, 68 తులాలు వెండి, బ్యాంకుల్లో రూ. 24 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే తహసీల్దార్ శ్రీధర్‌ను కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
కేజీబీవీ ప్రవేశాల దరఖాస్తుకు గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తుకు ఈ నెల 10 వరకు గడువు పొడిగించినట్లు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (ఏపీసీ) టి.శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాస్తవానికి బుధవారంతో గడువు ముగిసినప్పటికీ, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు 10వ తేదీ వరకు పొడిగిస్తూ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు https:// apkgbv.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. సమస్యలు, సందేహాలుంటే 79933 29115, 70750 39990 నంబర్లలో సంప్రదించాలన్నారు.


