పెనుకొండ: ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతతో కలిసి మండలంలోని మునిమడుగు గ్రామంలో వెయ్యి ఎకరాల భూమికి బోగస్ అగ్రిమెంట్‌లు సృష్టించి రూ. 8 కోట్లు స్వాహా చేసిన వైనం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ భూమాయాజాలంలో ఓ టీడీపీ ముఖ్య నాయకుడు ఉండటంతో గ్రామానికి చెందిన రైతులు నోరు విప్పడానికి కూడా భయపడుతున్నారు.
నకిలీ అగ్రిమెంట్లతో టోకరా..
‘కియా’ రాకతో పెనుకొండ సమీపంలోని భూముల ధరలు ఆకాశానికి చేరాయి. రియల్ వ్యావారం జోరుగా సాగింది. ఈక్రమంలోనే 2021–22 మధ్యకాలంలో నెల్లూరుకు చెందిన కొందరు భూవ్యాపారులు ‘కియా’ సమీపంలో భూములు కొనుగోలు చేయాలని భావించారు. ఇందుకోసం ధర్మవరంలో తమకు తెలిసిన ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లను సంప్రదించారు. సదరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తమకు పరిచయస్తుడైన మునిమడుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడిని కలిసి విషయం తెలిపారు. అయితే భూములు చూపి కమీషన్లు తీసుకోవాల్సిన సదరు టీడీపీ నాయకుడు దోపిడీకి ప్లాన్ చేశాడు. ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా నెల్లూరు భూవ్యాపారులకు టోపీ పెట్టాలని సిద్ధమయ్యాడు. కావాల్సినంత భూమి సిద్ధంగా ఉందని సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా నకిలీ అగ్రిమెంట్లు పంపి రైతులకు ఇవ్వాలంటూ రూ. 8 కోట్లు అడ్వాన్సుగా తీసుకున్నాడు. అనంతరం ఆ మొత్తాన్ని ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, మునిమడుగుకు చెందిన టీడీపీ నాయకుడితో పాటు మరికొందరు వ్యక్తులు తలా ఇంతని పంచుకున్నారు.
కడప రైతుల ఫొటోలతో పాస్ పుస్తకాలు..
రూ.8 కోట్లు ఇచ్చిన నెల్లూరు వాసులు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరగా... సదరు టీడీపీ నాయకుడు కడపకు చెందిన వారి ఫొటోలు సేకరించి మునిమడుగు రైతుల భూముల సర్వే నంబర్‌లతో బోగస్ పాసు పుస్తకాలు తయారు చేయించాడు. ఆ పాసు పుస్తకాలనే రూ. 8 కోట్లు ఇచ్చిన భూమి కొనుగోలు దారులకు ఇచ్చినట్లు మునిమడుగు రైతులు పేర్కొంటున్నారు. అయితే అప్పటి నుంచి ఏమీ పట్టించుకోని భూమి కొనుగోలు దారులు ఇటీవల మునిమడుగుకు వచ్చి తాము కొనుగోలు చేసిన భూముల పరిశీలనకు వెళ్లగా..రియల్ మోసం బయటపడింది. భూముల్లోకి వెళ్లిన వారిని రైతులు అడ్డుకోవడంతో పాటు కేసులు పెడతామని చెప్పడంతో తాము మోసపోయామని వారు గ్రహించారు. వెంటనే వారు ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లను నిలదీయడంతో మోసం బయటపడింది.
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. దర్యాప్తు
రూ.8 కోట్లు ఇచ్చి మోసపోయిన నెల్లూరు జిల్లా రియల్ వ్యాపారులు ధర్మవరానికి చెందిన బ్రోకర్‌లపై ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము భూములు కొనుగోలు చేసింది, ఎక్కడ కొనుగోలు చేసింది, దీని వెనుక ఉన్న సూత్రధారుల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ధర్మవరం సీఐ నాగేంద్ర ధర్మవరానికి చెందిన బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే మునిమడుగుకు వెళ్లి రైతులనూ విచారించారు. అయితే తాము ఎవరికీ భూములను విక్రయించలేదన్నారు. దీంతో సీఐ సదరు భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపగా... ఫొటోలను పరిశీలించిన రైతులు.. వారెవరో కూడా తమకు తెలియదని చెప్పారు. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారించగా కడపకు చెందిన రైతుల ఫొటోలని తేలింది. ప్రస్తుతం పోలీసులు 50 మంది రైతులతో స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
నేడోరేపో కీలక వ్యక్తి అరెస్ట్..
మునిమడుగు భూమాయాజాలం కేసులో ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించిన ధర్మవరం పోలీసులు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అధికారపార్టీకి చెందిన ఓ నేతను నేడోరేపో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా మునిమడుగు గ్రామంలో కలకలం రేపుతున్న భూమాయాజాలంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని గ్రామ రైతులతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
పెనుకొండ మండలం
మునిమడుగులో ‘రియల్’ మోసం
వెయ్యి ఎకరాలకు బోగస్ అగ్రిమెంట్లు
కడప రైతుల ఫొటోలతో
నకిలీ పాస్ పుస్తకాలు
నెల్లూరు జిల్లా వాసుల నుంచి
రూ. 8 కోట్లు వసూలు
భూమి స్వాధీనానికి వెళితే
అడ్డుకున్న రైతులు
ధర్మవరం పోలీసులను ఆశ్రయించిన నెల్లూరు వాసులు
పోలీసుల అదుపులో ధర్మవరం బ్రోకర్
నేడోరేపో టీడీపీ నాయకుడు,
ఇతర సూత్రధారుల అరెస్ట్!
కియా ఏర్పాటయ్యాక పెనుకొండ
సమీపంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ‘రియల్’ మోసాలు అదే స్థాయిలో జరిగాయి. ఈ క్రమంలోనే ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, మునిమడుగుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు కలిసి నెల్లూరుకు
చెందిన వారికి ఏకంగా రూ.8 కోట్లకు టోపీ పెట్టారు. నకిలీ అగ్రిమెంట్లు, పాసుపుస్తకాలతో బురిడీ కొట్టించి తలా ఇంత పంచుకుతిన్నారు. తాజాగా భూముల వద్దకు వెళ్లిన బాధితులు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా... వారు కూపీ లాగుతున్నారు.
బోగస్ పాసుపుస్తకాలు ఇచ్చేస్తే పోలా!!
అంతా వాళ్లే చూసుకుంటారులే !


