బ్రహ్మోత్సవాలపై కూటమి కుట్ర | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలపై కూటమి కుట్ర

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

తాడిమర్రి: తాడిమర్రికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. కొక్కంటి పాలెగాళ్ల వంశానికి చెందిన రామప్ప నాయుడు ఇక్కడ కోటను నిర్మించారు. పలువురు రాజులను జయించి, రాజ్యాలను కై వసం చేసుకున్నారని చరిత్రకారులు చెబుతారు. రామప్ప నాయుడు యుద్ధాలకు వెళ్లేప్పుడు కోటలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో తప్పకుండా ప్రత్యేక పూజలు చేసేవారని, అందుకే ఆయనకు తిరుగేలేకుండా పోయిందని పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏటా శ్రీరామ నవమి పండుగ నుంచి 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించే వారని, ఇందుకోసం ఆలయానికి రామప్ప నాయుడు 30 ఎకరాల మాన్యం భూములను కేటాయించారని ఇక్కడి వారు గుర్తు చేసుకుంటుంటారు. గతంలో ఇక్కడ పెద్ద చక్రాలు కలిగిన రథం ఉండేదని, 40 ఏళ్ల క్రితం వరకూ ఆలయంలో గ్రామస్తులు పూజలు నిర్వహించేవారు. అయితే ఆలయంలోని లక్ష్మీచెన్నకేశ్వస్వామి విగ్రహాల కింద గుప్త నిధులు ఉన్నాయని దుండగులు ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో బ్రహ్మోత్సవాలు నిర్వహణ ఆగిపోయింది.

చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో

ఆలయ నిర్మాణం

2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణానికి తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. వైఎస్సార్‌ ద్వారా దేవదాయ శాఖ నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. అలాగే చంద్రశేఖరెడ్డి వంశస్తుల ఉమ్మడి ఆస్తి 10 ఎకరాలను అమ్మి ఆలయ నిర్మాణానికి గ్రామస్తుల కాంట్రిబ్యూషన్‌ కింద నిధులు అందించారు. దీంతో 2006లో కోట ముఖ ద్వారం ముందు భాగంలో లక్ష్మీచెన్నకేశవస్వామి నూతన ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి తాడిమర్రి చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీరామ నవమి నుంచి 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు సాగే వేడుకల్లో చివరి రోజు రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవం రోజున చెక్కభజన, కీలు గుర్రాల నాట్యాలు, మరగాళ్ల విన్యాసాలతో పాటు పౌరాణిక నాటకం, రాతి దూలం లాగుడు పోటీలతో పాటు భక్తులకు అన్నదానం తదితర కార్యక్రమాలను ఆయన సొంత డబ్బులతో చేస్తూ వస్తున్నారు.

రూ.40 లక్షల వ్యయంతో నూతన రథం

లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలోని పురాతన రథం పాడై పోవడంతో ఎద్దుల బండిపై స్వామిని ఉంచి రథోత్సవం నిర్వహించేవారు. అయితే రెండేళ్ల క్రితం తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి తన సొంత డబ్బుతో పాటు కొంతమంది ద్వారా చందాలు తీసుకుని సుమారు రూ.40 లక్షల వ్యయంతో నూతన రథాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక కళ వచ్చి మరింత ఆదరణ లభించింది. ఏటికేడు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఓర్వలేక..మోకాలడ్డు

ఈ ఏడాది కూడా లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహణ కోసం వైఎస్సార్‌ సీపీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి కరపత్రాలను ముద్రించారు. అనంతరం ఉత్సవాలు నిర్వహణకు పోలీసుల అనుమతి కోసం వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను కలిశారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి తన సొంత భూమిలో రాతి దూలం లాగుడు పోటీలను నిర్వహించడానికి జేసీబీతో భూమిని చదును చేయిస్తుండగా... పోలీసులు పనులను ఆపివేయించారు. ఎందుకని ప్రశ్నిస్తే కూటమి నేతలు ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతున్నారని, మీరు తప్పుకోవాలని చెప్పారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు సుమారు వందమంది మరోసారి పోలీసుల అనుమతి కోసం వెళ్లగా, వారి నుంచి స్పందన లేదు. కనీసం రాతి దూలం లాగుడు పోటీలు, అన్నదానం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరినా... పోలీసులు ఒప్పు కోలేదు.

తూతూ మంత్రంగా ఉత్సవాలు

ఏటా శ్రీరామ నవమి నుంచి 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే వారు. రోజూ లక్ష్మీచెన్నకేశవస్వామిని ప్రత్యేకంగా అలంకరించి రోజుకో వాహనంపై గ్రామంలో ఊరేగిస్తూ ఎనిమిదో రోజు రథోత్సవం నిర్వహించే వారు. అయితే ఈ సారి తామే ఉత్సవాలు నిర్వహిస్తామంటూ ముందుకు వచ్చిన కూటమి నేతలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. వాహన సేవలు కూడా నిర్వహించడం లేదు. కీలకమైన రథోత్సవం గురువారం నిర్వహించాల్సి ఉండగా...ఏర్పాట్లు కూడా చేయలేదు. ఉత్సవాల నిర్వహణకు రూ.లక్షలు ఖర్చవుతాయని, అంత డబ్బు కూటమి నేతలు ఖర్చు చేసేందుకు ఇష్టం లేని కూటమి నేతలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నామని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతకానప్పుడు ఎందుకు అడ్డగించారని మండిపడుతున్నారు. గతంలో తాడిమర్రిలో తేరు (రథోత్సవం) జరుగుతుందంటే బంధుమిత్రులతో ఊరంతా పండుగలా ఉండేదని, ఈసారి ఆ సందడి లేదని గ్రామస్తులు చెబుతున్నారు. దేవుడి ఉత్సవాన్ని రాజకీయాలకు వాడుకున్న వారిని ఆ దేవుడే శిక్షిస్తాడని జనం అంటున్నారు.

లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవ నిర్వహణకు మోకాలడ్డు / దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలకు అడ్డగింత

పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులు / ఉత్సవాల నిర్వహణపై నీలినీడలు / ఆందోళన చెందుతున్న భక్తులు

తాడిమర్రి లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన రథోత్సవంపై నీలినీడలు అలుముకున్నాయి.

దశాబ్దాలుగా తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను చూసి ఓర్వలేని కూటమి నేతలు కుట్ర చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల అండతో ఈసారి ఉత్సవాన్ని అడ్డుకుంటున్నారు. రూ.లక్షలు ఖర్చయ్యే ఈ వేడుక నిర్వహణ చెప్పినంత సులువు కాదని, దేవుడి ఉత్సవంతో రాజకీయం చేస్తున్న కూటమి నేతల తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement