పీఆర్సీ సాధనకు తరలిరండి
● యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న
మడకశిర: నూతన పీఆర్సీ సాధన, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న విజయవాడ వేదికగా యూటీఎఫ్ తలపెట్టిన రణబేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలని యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనలో భాగంగా శుక్రవారం యూటీఎఫ్ నాయకులు సమావేశమై చర్చించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా... ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకిచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. పీఆర్సీని వెంటనే నియమించాలని, 2 9శాతం ఐఆర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. బకాయిలన్నీ విడుదల చేయాలన్నారు. ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహప్ప, మండల అధ్యక్షుడు మాలింగప్ప, సమన్వయకర్త మూడ్ల గిరియప్ప, స్థానిక నాయకులు ఎల్లప్ప, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు లాంఛనాలతో
జాగిలానికి అంత్యక్రియలు
పుట్టపర్తి టౌన్: వయోభారం కారణంగా పోలీసు విశ్రాంత జాగిలం శాండి శుక్రవారం మృతి చెందింది. జిల్లా పోలీస్ శాఖలో 2013 నుంచి 2024 వరకు విశిష్ట సేవలు అందించిన ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరి. గత ఏడాది నవంబర్ 30న పదవీ విరమణ పొందింది. జాగిలం మృతి చెందిన విషయం తెలియగానే ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహేష్, వలి, రవికుమార్ తదితరులు శాండీ కలేబరంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది చెన్నప్ప, బీడీటీం సిబ్బంది పాల్గొన్నారు.
పీఆర్సీ సాధనకు తరలిరండి


