హిందూపురం టౌన్: నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్యులకు సూచించారు. శనివారం పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని సమావేశ మందిరంలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ తిపేంద్ర నాయక్, హిందూపురం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ లింగన్న, హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఆర్‌ఎంఓ డేవిడ్ రాజ్, ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపామని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. అత్యవసర చికిత్స విభాగంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు.ప్రతి వైద్యుడూ సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా విధుల్లో ఉండాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు, స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఇంకా మెరుగ్గా రోగులకు అందించాలని, వచ్చిన నిధులను ఆసుపత్రి అభివృద్ధి కోసం వినియోగించుకోవాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి, మాతా శిశు మరణాలు తగ్గించడంతో పాటు ఓపీ, ఐపీ సేవలు మెరుగుపరచాలన్నారు. ఆస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలేనన్న విషయాన్ని గుర్తుంచుకుని వీలైనంత వరకూ కేసులను ఇతర ప్రాంతాలకు సిఫారసు చేయకుండా ఇక్కడే వైద్యం అందించే అందించాలని సూచించారు. అలాగే క్రిటికల్ కేర్ బ్లాకు సివిల్ వర్స్స్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, నూతన భవనాన్ని సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ పరిశీలించారు.
ఎన్టీఆర్ వైద్య సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
మాతా, శిశు మరణాల తగ్గింపునకు చర్యలు చేపట్టాలి
ఆస్పత్రి కమిటీ సమావేశంలో కలెక్టర్ టీఎస్ చేతన్