
సత్యసాయి: జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని పోలీసులు సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి, ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం ఆ యువకుడు పోలీసులను కలసి కృతజ్ఞతలు తెలిపాడు.
వివరాలు.. శెట్టూరు మండలం మాలేపల్లికి చెందిన వన్నూరుస్వామి వారం రోజుల క్రితం కుటుంబ సమస్యలతో విసుగు చెంది జీవితంపై విరక్తితో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు రోడ్డు పక్కన పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న యువకుడిని అదే సమయంలో అటుగా వెళ్లిన పట్టణ సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ నాగమధు గమనించి, వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న వన్నూరు స్వామి గురువారం కళ్యాణదుర్గానికి వచ్చి నేరుగా తనను కాపాడిన పోలీసులను కలసి కృతజ్ఞతలు తెలిపాడు. తన తల్లి మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వివరించాడు.