బియ్యం లేవు.. డబ్బులు పుచ్చుకోండి | - | Sakshi
Sakshi News home page

బియ్యం లేవు.. డబ్బులు పుచ్చుకోండి

Nov 11 2026 11:55 PM | Updated on Nov 11 2026 11:55 PM

నెల్లూరు(పొగతోట): పేదల బియ్యాన్ని కాజేసేందుకు రేషన్‌ డీలర్లు చౌకబారు చేష్టలకు పాల్పడుతున్నారు. బియ్యం లేవు .. డబ్బులిస్తాం.. తీసుకోండంటూ కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆపై వీటిని పట్టపగలే అక్రమంగా తరలించి రూ.కోట్లను అర్జిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ కనుసన్నల్లో అక్రమ రవాణా జరుగుతోంది.

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ..

ఈ వ్యవహారంలో అధికారులకు ముడుపులు ప్రతి నెలా అందుతున్నాయనే టాక్‌ నడుస్తోంది. ఈ కారణంతోనే బియ్యం అక్రమ రవాణా వాహనాలు పట్టపగలే పరుగులు తీస్తున్నా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రేషన్‌ షాపుల్లోనూ కార్డుదారులకు చుక్కలు చూపుతున్నారు. బియ్యం లేవు.. అయిపోయాయి.. రేషన్‌ కార్డుకు ఆధార్‌.. ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ అనుసంధానం కాలేదు.. ఇలా వివిధ కారణాలను చూపి వెనక్కి పంపుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, దిక్కున్నచోట చెప్పుకోండంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. నగరంలోని రంగనాయకులుపేట, వేదాయపాళెం, కరెంటాఫీస్‌ సెంటర్‌, ఏసీనగర్‌ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటోంది. బియ్యం అయిపోయిందంటూ ప్రతి నెలా మూణ్ణాలుగు తేదీల్లోనే నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 1470 చౌక దుకాణాలు.. 7.21 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ప్రతి నెలా 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో దాదాపు ఎనిమిది వేల మెట్రిక్‌ టన్నులు అక్రమ మార్గంలో ప్రతి నెలా తరలిపోతున్నాయి. కిలో బియ్యాన్ని రూ.17 నుంచి రూ.20కు కొనుగోలు చేసి పాలిష్‌ పట్టి బహిరంగ మార్కెట్లో రూ.75 నుంచి రూ.80కు విక్రయిస్తున్నారు. ఇలా కిలోకు రూ.45 మేర ఆర్జిస్తున్నారు.

దర్శనమిస్తున్న

నో స్టాక్‌ బోర్డులు

పేదల రైస్‌తో రూ.కోట్ల అక్రమార్జన

కార్డుదారులను ఇబ్బందులు పెడుతున్న డీలర్లు

పట్టపగలే మాఫియాకు

చేరుతున్న వైనం

అధికార పార్టీ అండదండలు

జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మాఫియా లీడర్లు అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలున్న వారికి బియ్యాన్ని విక్రయించని డీలర్లపై బెదిరింపులు, ఆఫీసర్లతో తనిఖీలు చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఫలితంగా వీరికే ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. వ్యాపారంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారు.. కిలోకు అధికంగా ఇస్తామనే ఆశ చూపుతున్నారు. అందరికీ వాటాలు అందుతుండటంతో వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

దోపిడీలో కొత్త పోకడలు

బియ్యం అక్రమ రవాణాలో నూతన విధానాలను మాఫియా లీడర్లు అమలు చేస్తున్నారు. చౌక దుకాణాల డీలర్ల నుంచి సేకరిస్తే వారికి కిలోకు అధిక మొత్తంలో నగదును చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి రేషన్‌ షాపు వద్ద ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేశారు. కార్డుదారులు బియ్యాన్ని తీసుకున్నాక డీలర్లకు వాటిని విక్రయించకుండా వీరు సేకరిస్తున్నారు. ఆపై చౌక దుకాణ చుట్టుపక్కల నిల్వ చేసి.. సమయం చూసి రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. పట్టపగలు తరలించినా, ఎవరికీ సందేహాలు రాకుండా అంగన్‌వాడీ కేంద్రాలకంటూ సాకులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement