● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): నేరపరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, శాసీ్త్రయ పద్ధతులను వినియోగించుకుని నేర నిరూపణ శాతాన్ని పెంచాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు అధికారులకు సూచించారు. నేర పరిశోధనలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంగా మంగళవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నగర పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నమూనా హత్య కేసు ఘటనా స్థలాన్ని ఏర్పాటు చేసి రక్తపు మరకలు, కత్తి, వేలిముద్రలు తదితర భౌతిక ఆధారాలను గుర్తించడం, సేకరించడం, భద్రపరచడం, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించే విధానాలను ప్రత్యక్షంగా వివరించారు. జిల్లాకు కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వ్యాన్‌లో 33 రకాల ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని వీటి ద్వారా ఘటనా స్థలంలోనే కీలక ఆధారాలు సేకరించవచ్చని తెలిపారు. హత్యలు, లైంగికదాడులు, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు, కాల్పులు, మాదకద్రవ్యాల కేసుల్లో వీటిన సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని భద్రపరచడం, ప్రతి ఆధారాన్ని ఫొటోలు, వీడియోల ద్వారా నమోదు చేయడం, సాక్ష్యాలు చెదిరిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతోపాటు ఫోరెన్సిక్, సీసీటివి, డిజిటల్ ఆధారాలను సమన్వయం చేసుకుని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కేసులో శాసీ్త్రయ ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నగర ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్సైలు, ఫోరెన్సిక్ సిబ్బంది పాల్గొన్నారు.


